కృష్ణానది... భారీ వరదతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద పొటెత్తింది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాయి. ఆల్మట్టి జలాశయానికి వరద భారీగా కొనసాగుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1705 అడుగులకు గాను.. ప్రస్తుతం 1700.49 అడుగులు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలకు గాను.. 106.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి 2 లక్షల 22 వేలకు క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 2 లక్షల 39 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్.. నిండుగా
ఆల్మట్టి నుంచి వరద నారాయణపూర్ చేరుతుంది. నారాయణ పూర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1615 అడుగులు కాగా... ప్రస్తుతం 1610.24 అడుగుల నీరు నిండింది. నారాయణపూర్ నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా... ఇప్పటికే 31.27 టీఎంసీల నీటితో జలకళను సంతరించుకుంది. జలాశయానికి 2 లక్షల 22 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా... 2 లక్షల 27 వేల890 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
జూరాలకూ వరద
నారాయణ పూర్ నుంచి జూరాల జలాశయానికి వరద క్రమంగా పెరుగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1045 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1044.52 అడుగులు చేరింది. 9.66 టీఎంసీలు సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో...ప్రస్తుత నీటి 9.36 టీఎంసీలకు చేరింది. జూరాలకు వస్తున్న ఇన్‌ఫ్లో 2 లక్షల 9 వేల క్యూసెక్కులను.. దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి లక్షా 98 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలయానికి చేరుతుంది.