ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయ్‌!

కర్నూలు జిల్లాలోని కొన్ని పంచాయతీలు అక్రమాలకు కేంద్రంగా మారాయి. రూ.లక్షలకు లక్షల నిధులు స్వాహా చేస్తున్నా చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నా నాయకుల అండదండలతో తిరిగి పోస్టింగులు తెప్పించుకుంటున్నారు. మరోవైపు ఈ నిధులను తిరిగి రాబట్టడంలోనూ అధికారులు శ్రద్ధ చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

illegal activities in karnool district pannchayats
అక్రమాలకు కేంద్రంగా మారిన పంచాయితీలు

By

Published : Sep 7, 2020, 2:41 PM IST

కర్నూలు జిల్లాలో పలు గ్రామ పంచాయతీలకు చెందిన కొందరు ఉద్యోగులు యథేచ్ఛగా నిధులు స్వాహా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నా చర్యలు అంతంతమాత్రంగానే తీసుకుంటున్నారు. రూ.లక్షలకు లక్షలు పక్కదారి పట్టించినవారిని సస్పెండ్‌ చేస్తున్నా కొద్ది రోజుల్లోనే తిరిగి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండా నిధులు స్వాహా చేస్తున్నా పర్యవేక్షించేవారే కరవయ్యారు.


పుష్కలంగా నేతల అండదండలు


అక్రమాలకు పాల్పడుతున్న కొందరు ఉద్యోగులకు రాజకీయ నేతల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తుండటంతో తిరిగి వారికి పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు కావాల్సిన ప్రాంతాల్లో నియమించుకుంటున్నారు. గ్రామాలకు కేటాయించే నిధులు స్వాహా అవుతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.


అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం



అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. పత్తికొండ, ఆలూరు తదితర పంచాయతీల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నాం. పత్తికొండలో వెంకటేశ్వర్లు నుంచి కొంత నిధులు రాబట్టాం. మిగిలినవారిపై ఆర్‌ఆర్‌ చట్టం ద్వారా వసూలు చేస్తాం. ఈవోఆర్డీలు, డీఎల్‌పీవోలు పరిశీలన చేస్తున్నారు - - కె.ఎల్‌.ప్రభాకరరావ్, జిల్లా పంచాయతీ అధికారి, కర్నూలు


కొన్ని ఉదాహరణలివే..


  • పత్తికొండ మేజరు పంచాయతీకి ఇన్‌ఛార్జి ఈవోగా వ్యవహరించిన వెంకటేశ్వర్లు రూ.65 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన అధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేశారు. కొద్దికాలం తర్వాత అతను ఆ మొత్తంలో కొంత తిరిగి చెల్లించడంతో మేజర్‌ పంచాయతీ బాధ్యతలను అప్పగించడం గమనార్హం.

  • ఆలూరు మేజరు పంచాయతీలో మూడేళ్ల కిందట రూ.34 లక్షలు స్వాహా చేశారంటూ ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తిపై చర్యలు తీసుకున్నారు. ఆ నిధులను రాబట్టే విషయమై అధికారులు దృష్టి సారించడం లేదు.

  • బిల్లేకల్‌ పంచాయతీలో గతంలో రూ.15 లక్షలు దుర్వినియోగమయ్యాయంటూ అప్పటి సర్పంచి చెక్‌పవర్‌ను రద్దు చేశారు. సంబంధిత ఈవోఆర్డీపై చర్యలు తీసుకున్నారు. నిధులు రాబట్టే ప్రయత్నాలు మాత్రం చేయలేదు.

  • చాలా పంచాయతీల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి: అన్​లాక్-4: ఈ నెల 21 నుంచి విద్యాలయాలకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details