ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ

రేపు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు డీ-ఫామ్ పట్టాలూ పంపిణీ చేయనున్నారు. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇప్పటికైనా పంపిణీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెదేపా నేతలు తెలిపారు.

house-documents-distribution-for-poor-people-from-tomorrow-in-andhra-pradhesh
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ

By

Published : Dec 24, 2020, 10:32 PM IST

నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పట్టణాలు, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ స్టాండింగ్ ఆర్డర్ బీఎస్ఓ-21 ప్రకారం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇళ్ల స్థలాల పట్టాలతోపాటు డీ-ఫామ్ పట్టాలూ పంపిణీ చేయనుంది. 30 లక్షల 57 వేల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుంది. మరోవైపు తెలుగుదేశం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇప్పటికైనా ప్రజలకు పంపిణీ చేయడం హర్షనీయమని తెదేపా నేత ఎమ్​డీ నజీర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని కోరారు.

విశాఖపట్నం జిల్లాలో...

నర్సీపట్నం నియోజకవర్గంలోని సుమారు 8 వేల 232 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.

అర్హతలేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అనకాపల్లిలో లబ్ధిదారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

కర్నూలు జిల్లాలో...

30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. కర్నూలు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్​ను కోరారు.

ప్రకాశం జిల్లాలో...

చీరాల మండలంలో పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాలను స్థానిక వైకాపా నాయకులు పరిశీలించారు. పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చుతున్నారని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో...

తణుకు నియోజవర్గంలో రేపటి నుంచి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. నియోజకవర్గంలో 346 ఎకరాలు సేకరించి 18 వేల మంది లబ్ధిదారులకు పంచుతున్నట్లు తెలిపారు.

కృష్ణా జిల్లాలో...

జిల్లాలో 3.33 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఇళ్ల పట్టాలతో పాటు టిడ్కో గృహాల సేల్ డీడ్ , ఇల్లు మంజూరు పత్రాలు అందజేస్తామని తెలిపారు. వివాదాస్పద స్థలాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.

గుంటూరు జిల్లాలో...

చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిధిలో పేదలకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాలను జేసీ దినేష్ కుమార్ పరిశీలించారు. జిల్లాలోని 17 నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2.8 లక్షల మందికి నివేశన పట్టాలు, 30 వేల మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీచదవండి.

వ్యవస్థల వైఫల్యమే స్నేహలత ప్రాణాలు తీసింది: పవన్

ABOUT THE AUTHOR

...view details