శ్రీశైలానికి వరద ప్రవాహం...సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు - నాగర్జున సాగర్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠానికి చేరిన కారణంగా.. వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా... జలాశయం జలకళ సంతరించుకుంది. 10 గేట్ల ద్వారా 7 లక్షల 50 వేల 180 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 179.51 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెుత్తం నీటిమట్టం 885 అడుగులకు గానూ..ప్రస్తుతం 878.30 అడుగుల నీరు చేరింది. జలాశయానికి ఇన్‌ఫ్లో 8 లక్షల 16 వేల 254 క్యూసెక్కులు ఉండగా...ఔట్ ఫ్లో 8 లక్షల 48 వేల 374గా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 28,956 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు విడుదల చేయగా...పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.