ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం: హైకోర్టు - High Court

Transfers issue in health department: వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ వైఖరి వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, జాతీయ వైద్య కమిషన్ చైర్మన్లకు నోటీలు జారీచేసింది.

hc on health department
hc on health department

By

Published : Mar 6, 2022, 5:43 AM IST

Transfers issue in health department: వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు , అసోసియేట్ ప్రొఫెసర్లు , అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వైఖరి వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, వైద్య విద్య డైరెక్టర్, జాతీయ వైద్య కమిషన్ చైర్మన్లకు నోటీలు జారీచేసింది. విచారణను ఈనెల 29 కి వాయిదా వేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైతే జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.కృష్ణమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ జనవరి 28 జారీచేసిన జీవో 40, ఫిబ్రవరి 24 న జారీచేసిన జీవో 128 లను సవాలు చేస్తూ కర్నూలు వైద్య కళాశాల పీజీ విద్యార్థి జీవీ సాయి ఫణి శంకర్​తో పాటుగా మరో 36 మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వారి తరఫున న్యాయవాది జి.అరుణ్ శౌరి వాదనలు వినిపిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో బోధనా సిబ్బందిని బదిలీ చేస్తే విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ప్రక్రియను అడ్డుకోవాలన్నారు.

న్యాయమూర్తి స్పందిస్తూ ఉద్యోగులను బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. బదిలీలపై అభ్యంతరం ఉన్న ప్రొఫెసర్లు కోర్టుకు రావాలని అంతేతప్ప వారి తరఫున విద్యార్థులు వ్యాజ్యం వేయలేరని వ్యాఖ్యానించారు. ఇది ప్రొఫెసర్ల తరఫున వేసిన వ్యాజ్యంగా ఉందన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాది బదులిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో బదిలీతో విద్యార్థులకు ఇబ్బందినే కారణంతో వ్యాజ్యం వేశామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాహితానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ విద్యార్థులందరూ ప్రభావితం అయ్యేపని అయితే ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని సూచించారు. ప్రొఫెసర్లు బదిలీ అయినా ఆ స్థానంలో కొత్త వాళ్లు వస్తారుకదా అని ప్రశ్నించారు. వ్యక్తులు ముఖ్యంకాదన్నారు. వ్యవస్థలు ముఖ్యమన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిబంధనలకు అనుగుణంగానే బదిలీ ఉత్తర్వుల జీవోలు ఉన్నాయన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇన్వాలన్నారు. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ప్రభుత్వం కౌంటర్ వేశాక ఉత్తర్వులు చట్టవిరుద్ధమైతే జోక్యం చేసుకుంటామని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి:శ్రీలక్ష్మిపై హైకోర్టు వ్యంగ్యాస్త్రం... ఆమే 'సిన్సియర్‌' సీనియర్‌ మోస్ట్‌ ఐఏఎస్‌ అంటూ..

ABOUT THE AUTHOR

...view details