కష్టాలు.. కన్నీళ్లు కలబోత చేనేత. ఇప్పటికే కొవిడ్‌తో తీవ్ర ఒడిదొడుకులతో కుదేలైన చేనేత రంగం పెరిగిన ధరలతో మరోమారు చతికిలపడింది. నూలు, ముడి సరకుల ధరలు రెండున్నరల నెలల వ్యవధిలో భారీగా పెరగడంతో..అంతపెట్టి కొని నేసినా కొనుగోలుదారులు ముందుకు రారన్న ఆలోచనతో మాస్టర్ వీవర్లు మగ్గాలు పక్కకు పెట్టేస్తున్నారు. మరోవైపు చిన్నచిన్న పరిశ్రమలు 40శాతం ఇప్పటికే మూతపడ్డాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వస్త్రాలపై 5 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతం పెంచడం మరింత కష్టాల్లోకి నెట్టేసింది.
రాష్ట్రంలో ధర్మవరం, ఉరవకొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంగళగిరి, ఉప్పాడ, చీరాల, వెంకటగిరి, మదనపల్లి చీరల ఉత్పత్తికి ప్రఖ్యాత కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా 1.10 లక్షల చేనేత కుటుంబాలు ఉండగా, మగ్గాలు సుమారు 3 లక్షల వరకు ఉన్నాయి. చీరల తయారీకి అవసరమైన ముడి పట్టు (రాసిల్క్) కిలో రూ.3,600 పలుకుతుండగా, ఇప్పుడు ఒకేసారి రూ.5,800కు చేరింది. పట్టుగూళ్లు కిలో రూ.350-500 నుంచి రూ.850కి చేరింది. జరీ, డైయింగ్ రసాయనాలు, కాటన్ ధరలూ పెరిగాయి. ముడిసరకు ధరలు 30శాతం పెరగడంతో రూ.6వేలు అమ్మే చీర ధర రూ.8వేలకు పెరిగింది.
ధరలు తగ్గే వరకు ఆగుదామని..
పెరిగిన ముడి సరకుల ధరలతో ఒకవేళ కొన్ని నేసినా వినియోగదారుడు అంత ధరకు కొనేందుకు ముందుకు రారని మాస్టర్ వీవర్లు, పరిశ్రమల యజమానులు భావిస్తున్నారు. రెండు, మూడు మగ్గాలున్న నేతన్నలు నష్టాలకు నేయడం కన్నా, ధరలు అదుపులోకి వచ్చే వరకు వేచి ఉందామని 20శాతానికి పైగా మగ్గాలు నిలిపివేశారు. నెలకు ఒక్కో మగ్గంపై 4-6 చీరలు నేసే పరిస్థితి నుంచి ఒకటి, రెండు చీరలకే పరిమితమవుతున్నారు. దీంతో 4.50లక్షల మంది నేత కార్మికులు, అనుబంధ కార్మికులు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది.