ఏడేళ్లు అవాంతరాలే..
కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని పగిడిరాయి, జొన్నగిరి, జి.ఎర్రగుడి గ్రామాల్లోని భూముల్లో పసిడి తవ్వకాలకు ప్రభుత్వం 2013, అక్టోబర్ 8న అనుమతులిస్తూ జీవో 106ను విడుదల చేసింది. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా కంపెనీ జాయింట్ వెంచర్‌గా జియోమైసూర్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సుమారు 1477.24 ఎకరాలు కేటాయించారు. 350 ఎకరాల్లో ఓపెన్‌కాస్ట్ మైనింగ్ చేపట్టేందుకు సంస్థ శ్రీకారం చుట్టింది. దీనికి ఎకరాకు రైతులకు రూ.12 లక్షలు చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. ధర నిర్ణయంలో కొంత జాప్యం ఏర్పడింది. ఇదే సమయంలో మైనింగ్‌కు ఆనుకొని ఉన్న పొలాలకు కౌలు చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేయడం, కొందరు కోర్టులకు వెళ్లడంతో అవాంతరాలు ఏర్పడ్డాయి.
ఏటా 750 కేజీలు వెలికి తీసేలా
మొదటి విడత కింద ఎనిమిదేళ్లపాటు ఏటా 750 కేజీల బంగారం వెలికితీసేలా సంస్థ ప్రణాళిక చేసింది. టన్ను రాయిలో 1.25 గ్రాముల బంగారం ఉంటుందని ప్రభుత్వం నిర్ధరించింది. అయితే సంస్థ ప్రతినిధులు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు చెందిన నిపుణుల బృందంతో ప్రతి 20 మీటర్లకు ఒక రంధ్రం(డ్రిల్‌హోల్స్) వేసి పరీక్షలు నిర్వహించారు. ఇలా 3 వేల మీటర్లు రెండున్నరేళ్లపాటు భూమిలో రంధ్రాలు వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించగా...టన్ను రాయిలో 1.5 గ్రాములున్నట్లు నిర్ధరించుకున్నారు.
హంద్రీ నుంచి పైపులైను
మైనింగ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రిపోర్టు రావడానికి 2017 వరకు పట్టిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఆ తర్వాత నీరు, విద్యుత్తు అనుమతి కోరగా..హంద్రీ నుంచి 18 కి.మీ. పైపులైను నిర్మించి నీరు తీసుకునేందుకు ఆదేశాలొచ్చాయన్నారు. ఈ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల సరిహద్దున ఉన్న ‘దొన’కు తూర్పున మైనింగ్‌కు ప్రధాన కేంద్రంగా సంస్థ గుర్తించింది. ఆంగ్లేయులు పాలనాకాలంలో ఇక్కడ బంగారు ఖనిజం వెలికితీయగా ఏర్పడిన పెద్ద గొయ్యినే ఇప్పుడు దొన అంటున్నారు. ఇక్కడ రైల్వే ట్రాక్ సమీపంలో రూ.280 కోట్లతో బంగారు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పన్ను కోల్పోయినట్లే
బంగారు గనుల తవ్వకాలతో 300 మందికి ఉపాధి లభించనుంది. రాయల్టీ ధర కేంద్రం నిర్ణయించినా చెల్లించేది రాష్ట్రానికే. అలా చూస్తే రాయల్టీపై 4%, డీఎంఎఫ్ అన్నీ కలుపుకొని 5.28 శాతం ప్రభుత్వానికి అందుతుంది. వీటితోపాటు సంస్థ నుంచి పన్ను రూపంలో 35 శాతం వసూలు చేస్తారు. తవ్వకాలు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో ఏళ్ల తరబడి పన్ను కోల్పోయినట్లే అయింది.
ప్రచారం నిజం కాదు
భూసేకరణలో జాప్యం జరుగుతోంది. సంస్థకు చెందిన షేర్ హోల్డర్లు అందరూ వెనక్కి వెళ్లిపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇది నిజం కాదు. భాగస్వామ్యులు పొలాలు చూసి నిధులిచ్చే సమయానికి కరోనాతో కొంత జాప్యమైంది. త్వరలో తవ్వకాలు చేపడతాం. - హనుమప్రసాద్, జియోమైసూర్ సంస్థ సీఈవో
ఇదీ చదవండి:కరోనాకి భారత్ బయోటెక్ వ్యాక్సిన్: క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ అనుమతి