కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు అన్నారు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో అల్ ఇండియా కిసాన్ సంఘర్షన్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.
'వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల నిర్ణయం అనాలోచితం'
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు తప్పుబట్టారు. ఇది పూర్తిగా అనాలోచిత నిర్ణయమని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఆయన వ్యతిరేకించారు.
ex minister vadde
వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగానికి ప్రతికూలంగా ఉన్నాయని చెప్పారు. వీటివల్ల రైతులపై ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం చెలాయించే అవకాశం ఉందని మండిపడ్డారు. అలాగే వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు బిగించాలని రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏ మాత్రం సరికాదన్నారు. ఇది పూర్తిగా అనాలోచితమని శోభనాదీశ్వరరావు దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలోనే రాష్ట్రం ఈ చర్యకు పూనుకుందని విమర్శించారు.