ఆ పేద రైతుకు కాడెడ్లు కొనే ఆర్థిక స్థోమత లేదు... కానీ దుక్కి దున్నాల్సిందే.. పంట పండించాల్సిందే.. కుటుంబాన్ని పోషించాల్సిందే. ఏం చేయాలా? అని తల పట్టుకున్నాడు. అప్పుడు అతనికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లో పెంచుకుంటున్న పొట్టేలును పొలానికి తీసుకువెళ్లాడు. అరక కట్టాడు. కూతురి చేతికి పొట్టేలు మెడలో వేసిన తాడు ఇచ్చాడు. భార్య నాగలి పట్టింది. పొట్టేలుతో సహా మొత్తం ఆ కుటుంబం దుక్కి దున్నింది. ఈ దృశ్యాలు వారి దుస్థితికే కాదు.. అన్నదాతల సామాజిక, ఆర్థిక పరిస్థితులకు దర్పణం పడుతోంది.
కాడెడ్లకు బాడుగ చెల్లించలేక.. పొట్టేలుతో పొలం దున్నిన రైతు - agriculture in kurnool district
రోజురోజుకు రైతుల కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. పంట పండించే వరకు ఓ కష్టం.. తీరా పండించిన పంటను అమ్ముకునేందుకు మరో కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయడమే గగనమై పోతున్న తరుణంలో.. మరోవైపు కరోనా వెంటాడుతోంది. దీంతో వ్యవసాయం చేసేందుకు డబ్బులు లేక అనేకమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాయా కష్టం చేసుకుందామంటే పనులు కూడా దొరకని పరిస్థితి. దీంతో ఉన్న భూమిలోనే కష్టపడి సేద్యం చేసేందుకు నడుం కడుతున్నారు. అయితే పొలం దున్నేందుకు కాడెడ్లు లేక.. అద్దెకు తెచ్చి సేద్యం చేసే స్థోమత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రైతు కుటుంబం తమకు ఉన్న పొట్టేలుతో పొలం దున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన రంజాన్ అనే రైతు.. తనకున్న ఎకరం పొలంలో పత్తి పంట వేశాడు. కలుపు పెరిగిపోవడంతో వాటిని తొలగించేందుకు కాడెడ్లతో దున్నాలని భావించాడు. కానీ అందుకు వెయ్యి రూపాయలు అడగడంతో అంత చెల్లించుకోలేకపోయాడు. దీంతో తాను పెంచుకుంటున్న పొట్టేలు సహాయంతో పత్తిలో కలుపు తీశాడు. పొట్టేలు పొలంలో ముందుకు నడవకపోవడంతో.. తన పిల్లలతో పొట్టేలు నోటికి మేత అందిస్తూ ముందుకు నడిపించాడు. అతని భార్య నాగలి పట్టుకోగా.. వారిని అనుసరిస్తూ పొట్టేలు పొలం దున్నింది.
ఇదీచదవండి.