కర్నూలు జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలసిన అహోబిల క్షేత్రంలోని శిల్ప సంపదను పరిరక్షిస్తామని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి వాణిమోహన్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె అహోబిలంలో పర్యటించారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆశీర్వాదాలు అందుకున్నారు.
ఎన్నో శతాబ్దాల శిల్పసంపదకు అహోబిలం నెలవుగా ఉందని ఆమె అన్నారు. శిథిలమై పోతున్న ఈ సంపదను రక్షించే బాధ్యతను దేవాదాయశాఖ తీసుకుంటుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇక్కడి శిల్పాలకు మెరుగులు దిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.