కర్నూలు జిల్లా ఆదోని, ఆలూరు సబ్ డివిజన్ల పరిధిలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో ఏఐఐబీ (ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్) నిధులతో ప్యాకేజీ 41 కింద 52 రహదారుల పనులు చేపట్టారు. 2019 సంవత్సరంలో వీటికి ప్రభుత్వం టెండర్లు పిలిచి తిరుపతిరెడ్డి బ్రదర్స్ (నెల్లూరు జిల్లా) సంస్థకు పనులు అప్పగించింది. ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు, ఆస్పరి, హాలహర్వి, హోళగుంద, దేవనకొండ పరిధిలో 44 రహదారుల పనులు రూ. 67.12 కోట్లతో చేపట్టారు. మంత్రి గుమ్మనూరు జయరాం అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉండగా కొంత గడువు పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్‌కు అది ముగిసింది. మరో ఆరు నెలలు గడువు కోరుతూ కొత్తగా ప్రతిపాదనలు పంపారు.
మూడేళ్లుగా నరకం
ఆలూరు నియోజకవర్గం పరిధిలోని చాలా గ్రామాల్లో పాత రోడ్డుపై కంకర తోలి వదిలేశారు. దీంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ఆలూరుకు వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాలకు కాలినడకన వెళ్లే వృద్ధులు, చిన్నారులు కంకర రాళ్లపై నడవలేక నరకం చూస్తున్నారు. ప్రతి గ్రామ రహదారి ఇలానే అసంపూర్తిగా ఉండటంతో రోజూ ఎంతోమంది వాహన చోదకులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనాలు పాడైపోతున్నాయి. ప్రయాణానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. హోళగుంద ప్రధాన రహదారి నుంచి బిలేహాల్ గ్రామానికి వెళ్లే దారిలో కంకర పోసి వదిలేశారు. ఆదోని రోడ్డు నుంచి ఎ.గోనేహాల్ గ్రామానికి వెళ్లే దారి సైతం కంకర వేసి వదిలిపెట్టారు. హోళగుంద నుంచి కర్ణాటక సరిహద్దు మార్లమడికి రోడ్డుకు గుమ్మనూరు జయరాం భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టగా, కేవలం మట్టి తోలి వదిలేశారు.