ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధైర్యపడొద్దు... బాధితులందరినీ ఆదుకుంటాం: సీఎం

కర్నూలు జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల డివిజన్​లో వరద ప్రాంతాలను సీఎం పరిశీలించారు.

By

Published : Sep 21, 2019, 6:07 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

కర్నూలు జిల్లాలో వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల డివిజన్​లో సీఎం జగన్ విహంగ వీక్షణం చేశారు. అనంతరం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించి... అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాయలసీమ ప్రాంతంలో సాధారణంగా వర్షాలు తక్కువ కరుస్తాయని... ఈ సారి మాత్రం సంవృద్ధిగా కురిశాయని హర్షం వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్​లో వర్షాల కారణంగా... రూ.784 కోట్ల నష్టం వాటిల్లిందని జగన్​మోహన్ రెడ్డి తెలిపారు. 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సహా... 31వేల హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. కుందూనదీ పరివాహక ప్రాంత ప్రజలకు భవిష్యత్తలో ఇబ్బంది కలగకుండా... శాశ్వత ప్రతిపాదికన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీశైలం జలాశయానికి ఏటికేడు వరద తగ్గుతోందని... గోదావరి నీటిని కృష్ణానదిలో కలిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు వివరించారు.

40 రోజుల్లోనే రాయలసీమలోని జలాశయాలన్నీ నింపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సాధారణంగా ఇచ్చే నష్టపరిహారం కంటే... రూ.2వేలు అధిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాలకు ఆదుకోవడానికి తక్షణం 25 కిలోల బియ్యం, కిలో కంది పప్పు, లీటర్ పామాయిల్, కిలో బంగాళదుంపలు సరఫరా చేయాలని జిల్లా పాలనాధికారిని అదేశించారు.

కలెక్టర్ కార్యాలయంలో వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి... తక్షణం వారి ఇబ్బందులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం వరద బాధితులకు అండగా ఉంటారని సీఎం వివరించారు.

ఇదీ చదవండీ... 'పోలవరం రివర్స్​ టెండరింగ్​ తో రూ.58 కోట్లు ఆదా'

ABOUT THE AUTHOR

...view details