కర్నూలులో... ఆటో మొబైల్ రంగంపై ఆధారపడి సుమారు 10 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ద్విచక్రవాహనాలు, ఆటోలు, లారీలు, బస్సులు రిపేర్లు చేసే మెకానిక్ లు, స్పేర్ పార్ట్స్ దుకాణ యజమానులు, అందులో పనిచేసే సిబ్బంది ఇలా ఎంతో మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా కారణంగా... లాక్ డౌన్ విధించటంతో... వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు రెండు నెలలు కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. కనీసం ఆదుకునే నాథుడే కరువయ్యాడు.
ఇప్పుడు వాహనాలు తిరుగుతున్నపటికీ కార్మికులకు పూర్తి స్థాయిలో పని లభించడం లేదు. ఓ రోజు పని ఉండే మరో రోజు ఖాళీగా ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న షాపులు ఉన్నవారికి అద్దెలు, కరెంటు బిల్లుల భారం మీద పడింది. అద్దెలు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నామని కార్మికులు వాపోయారు. ప్రభుత్వం వాహన మిత్ర కింద ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించినట్లే..తమనూ ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.