అన్నగారికి పసుపుదళం నివాళి ఎన్టీఆర్ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.
నంద్యాలలో పెద్ద ఎత్తున
స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని నంద్యాలలోనూ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు జాతికి తారకరాముడు అందించిన సేవలను కొనియాడారు.
ఆలూరులో సంబరంగా
ఆలూరులో తెదేపా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ రామ్ భీమ్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు తెలుగుదేశం కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు.
మిఠాయిలు పంచుతూ
కోడుమూరు నియోజకవర్గంలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెదేపా నాయకులు జరుపుకున్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.
అన్నగారి వేషధారణలో
ఎన్టీఆర్ జయంతి వేడుకను కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వినూత్నంగా నిర్వహించారు. అన్నగారి వేషధారణలో తెదేపా శ్రేణులను అలరించారు. నగరంలోని ఎన్టీఆర్ కూడలిలోని తారకరాముని విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు.