ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆళ్లగడ్డ.....కాబోతుంది ఎవరి అడ్డా? - బిజేంద్రరెడ్డి

తాతలు పోటీ పడ్డారు... తండ్రులు బరిలో నిలిచారు... ఇప్పుడు మూడో తరం ఎన్నికల పోరులో నువ్వా - నేనా అంటున్నారు. రాజకీయ పోరుతో పాటు వర్గపోరు ఉండే ఆ నియోజకవర్గ రాజకీయం అంత సులువుగా అంతుపట్టదు. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రాజకీయం ఎన్నికలవేళ కుతకుత ఉడుకుతోంది.

ఆళ్లగడ్డ.....ఎవరి అడ్డా?

By

Published : Mar 23, 2019, 12:04 PM IST

ఆళ్లగడ్డ.....ఎవరి అడ్డా?

ఒకనాటి ఆంధ్రుల రాజధాని అయినకర్నూలు జిల్లా రాజకీయాలు.. ఎప్పుడూఆసక్తిగానే ఉంటాయి. అక్కడి రాజకీయాలుఏ సమయంలో ఎలా మారుతాయో అంచనా వేయలేం. ఇక్కడి రాజకీయం చదరంగంలానే ఉంటుంది. అలాంటి జిల్లా పరిధిలోనిదే ఆళ్లగడ్డ నియోజకవర్గం. ఏ పార్టీ గెలుస్తోంది అనే దానికంటే... ఏ కుటుంబం జెండా ఎగరేస్తోంది అనే దానిపైనే అందరి దృష్టి. తరతరాలుగా కొనసాగుతున్న వర్గపోరులో... ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


గంగుల వర్సెస్ భూమా ..

ఆళ్లగడ్డ రాజకీయ సంగ్రామంలో 2 కుటుంబాలే నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో... 1967 ఎన్నికల్లో గంగుల ప్రభాకర్​రెడ్డి తండ్రి ... తిమ్మారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. నాటి నుంచి ఆళ్లగడ్డలో కుటుంబ రాజకీయాలు పురుడుపోసుకున్నాయి. ఆ తర్వాత...1985లో భూమా నాగిరెడ్డి సోదరుడు శేఖర్​రెడ్డి పోటీతో భూమా కుటుంబం రాజకీయ రంగప్రవేశానికి అడుగులు పడ్డాయి. అక్కడి నుంచి భూమా- గంగుల కుటంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎంత శత్రుత్వం ఉన్నా ఏదో ఒక సందర్భంలో కలిసి పని చేసే సమయం వస్తోంది. అలాంటి సందర్భం వీరి మధ్య వచ్చింది. ఇరు కుటుంబాలు ఒకే పార్టీలో పని చేసినప్పటికి...ఉప్పు-నిప్పులాగే మెలిగారు. ప్రస్తుతం గంగుల కుటుంబం వైకాపాలో... భూమా కుటుంబం తెదేపాలో కొనసాగుతోంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి మరణించినా... వీరి కుటుంబాల మధ్య వైరం మాత్రం చావలేదు.

బరిలో మూడో తరం....

మూడు తరాలు గడుస్తోన్నా... గంగుల, భూమా కుటుంబాల మధ్య పోరు ఆగలేదు. ఈసారి ఎన్నికల్లో తెదేపా తరపున భూమా అఖిల ప్రియ బరిలో ఉండగా...వైకాపా తరఫున బ్రిజేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో అఖిల ప్రియ తాత ఎస్వీ సుబ్బారెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగా బ్రిజేంద్ర రెడ్డి తాత తిమ్మారెడ్డి పై పోటీ చేసి గెలిచారు. 1992లో అఖిల తండ్రి భూమా నాగిరెడ్డి తెదేపా అభ్యర్థిగా... కాంగ్రెస్ అభ్యర్థిగా బ్రిజేంద్ర తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డిపై గెలుపొందారు. ఆళ్లగడ్డ ఎవరి అడ్డా అన్న రీతిలో ప్రస్తుతం మూడో తరం పోటీలోకి దిగింది.

గెలుపుపై ధీమా....

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలప్రియ... మంత్రి అయ్యాక నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్లు, తాగునీరు, మౌలిక వసతులు కల్పించారు. ఈసారి ఎన్నికల్లో తనను కాదని....తన తల్లిదండ్రులను గెలిపించాలని ఓటర్లను కోరుతూ ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు.

వైఫల్యాలే అస్త్రంగా..

వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న బ్రిజేంద్రరెడ్డి పెద్దనాన్న గంగుల ప్రతాప్​రెడ్డి తెదేపాలో ఉండటం...నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టులేకపోవటం...ఎన్నికలకు కొత్త కావటం వంటివి ఆయనకు ఇబ్బందిగా మారాయి. తెదేపా వైఫల్యాలు, హామీల అమల్లో జాప్యం వంటి అస్ర్తాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని...ఈసారి ఫ్యాన్ గాలి వీస్తోందని వైకాపా అభ్యర్థి అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details