Adoni YSRCP Leaders Land Irregularities :ఆయన కర్నూలు జిల్లాలోని అధికార పార్టీకి చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి. ఆయన ప్రవృత్తి మాత్రం అక్రమార్జన. ఇందుకోసం దేన్నీ వదలని పరిస్థితి. ముందుగా ఆయన కన్ను భూములపై పడింది. క్రమంగా అది తారాస్థాయికి చేరింది. పంచాయితీ చేశారంటే ఆ ఆస్తి ఆయనకో, అనుచరులకో రావాల్సిందే. సెటిల్‌మెంట్లనే ప్రధాన ఆదాయవనరుగా మార్చుకున్న సదరు నేత కోట్ల విలువ చేసే భూములు సెటిల్ చేసి, తానే రాయించుకుంటారు. ఈ సెటిల్‌మెంట్లను తన దగ్గరకు తెచ్చేందుకు 20 మంది ఏజెంట్లను పెట్టుకున్నారు.
తిరగబడితే.. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు :కర్నూలు జిల్లా ఆదోని చుట్టుపక్కల సమస్యాత్మకంగా ఉన్న భూములపై వాలే ఈ సైన్యం బాధితులను సదరు నేత దగ్గరికి పంపిస్తారు. ఎలాంటి సమస్యా రాకుండా సైన్యంలోని ప్రధాన అనుచరుడు ముందుగా తమ మనుషుల్లోని SCలను బాధితుల వద్దకు పంపి ఆ భూమిని తమకే అమ్మేయాలని బెదిరిస్తారు. వారిపై బాధితులు తిరగబడితే తిరిగి వారిపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయిస్తామని భయపెడతారు. అలా భూములు స్వాధీనం చేసుకుని, వెంచర్లు వేసి విక్రయిస్తారు. దందాపై బాధితులు స్టేషన్‌కు వెళ్తే పోలీసులే వారిని ఆ ప్రజాప్రతినిధి వద్దకు పంపుతున్న పరిస్థితి.
వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!
Ruling Party Land Grabs in Andhra Pradesh :ఆదోని శివారు మండిగిర పంచాయతీ తిరుమలనగర్‌లో ఒక వెంచర్‌లో పార్కు కోసం వదిలిన 72 సెంట్ల స్థలాన్ని పంచాయతీ భూమి అని గతంలోనే బోర్డు పెట్టారు. ఇప్పుడు దాన్ని తొలగించి, ప్లాట్లుగా మార్చి అమ్మకానికి సిద్ధం చేశారు వైసీపీ నేతలు. ఇక్కడ సెంటు 10 నుంచి 15 లక్షల వరకు పలుకుతోంది. అంటే భూమి విలువ సరాసరి 8 నుంచి 10 కోట్లు. దీనిపై స్థానికులు జేసీకి ఫిర్యాదు చేయగా, వారిని ఆ ముఖ్య ప్రజాప్రతినిధి తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆ భూమి తమ వాళ్లదేనని, వాళ్లు కోర్టులో కేసు వేశారని అవసరమైతే మీరూ కోర్టుకు వెళ్లండని హెచ్చరించినట్లు సమాచారం.
YCP Leaders Land Irregularities inAdoni : ఆదోని శివారులోని 352 సర్వే నంబరులో దాదాపు 4.54 ఎకరాల్లో 1992లో ఇద్దరు వ్యక్తులు వెంచర్ వేసి, కొందరికి ప్లాట్లు కేటాయించారు. తర్వాత వీరు ఆ ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించగా భూమి తమదేనంటూ 424 మంది బయటకొచ్చారు. పంచాయితీ ఆ ప్రజాప్రతినిధి వద్దకు రాగా బాధితులకు సెంటుకు లక్ష చొప్పున నామమాత్రపు ధర చెల్లించి లాక్కున్నారు. అదే భూమిని సెంటు 8నుంచి 10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మండిగిరి పంచాయతీలో శాంతి అనే మహిళకు చెందిన 70 సెంట్ల భూమిని ఆక్రమించుకొని వెంచర్ వేశారు. ప్రశ్నిస్తే ఆ మహిళ కుటుంబానికి నామమాత్రపు ధర చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.