Young Man Succeed in Chess with Disability: చదరంగమంటే 64 గళ్ల రణరంగం. ప్రత్యర్థి ఎత్తుకు పైఎత్తులు వేయడం. మెదడుకు పనిచెబుతూ ఎదుటివారిని చిత్తుచేయడం. ఆరోగ్యవంతులే ఈ ఆట ఆడేందుకు చాలా కష్టపడతారు. అలాంటిది సెరిబ్రల్ ఫాల్సీ లక్షణాలతో శారీరక, మానసిక సమస్యలున్న విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన కార్తీక్ అనే యువకుడు చదరంగంలో దూసుకుపోతున్నాడు. ఆత్మస్థైర్యంతో వైకల్యాన్ని అధిగమిస్తూ విజయాలు సాధిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చదరంగం పోటీల్లో సత్తా చాటుతూ యువతరానికి స్పూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు.
Goal is to Become Grand Master: విజయవాడలోని రాజీవ్‌నగర్‌కు చెందిన నరసింహమూర్తి ఏకైక కుమారుడు వెంకట కార్తీక్. చిన్నతనంలోనే మానసిక, శారీరక సమస్యలు తలెత్తాయి. కాళ్లు, చేతులు, మెడ సరిగ్గా నిలబడవు. ఈ క్రమంలో పలువురు చూపుతున్న జాలి కార్తీక్‌కు నచ్చలేదు. దాన్ని అధిగమించాలంటే ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు చదరంగాన్ని ఎంచుకొని ముందుకుసాగుతున్నాడు.
"ఇప్పటివరకు ఇంటర్నేషనల్ తొలి నార్మ్ సాధించాను. ఇంటర్నేషనల్ మాస్టర్‌గా, ఆపై గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను. దేశవిదేశాల్లో ఎక్కడ పోటీలు జరిగినా కోచ్ షేక్ ఖాసీం సహకారంతో వెళ్తుంటాను. ఎన్ని ఘనతలు సాధించినా ఆర్థిక వనరులు ఆటంకంగా నిలుస్తున్నాయి. కొన్నిసార్లు స్పాన్సర్లు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అనుకుంటున్నాను". -వెంకట్ కార్తీక్, చెస్ క్రీడాకారుడు
చెస్ ఆటపై యువకుడి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు విజయవాడ గ్లోబల్ చెస్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. దాంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో గెలుపొందాడు కార్తీక్. 2014లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ చెస్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి దివ్యాంగుడిగా కార్తీక్ నిలిచాడు. 2014లోనే సెర్బియాలో జరిగిన ఐపీసీఏ (IPCA) ఛాంపియన్ షిప్ పోటీల్లో కాంస్యపతకం సహా మరెన్నో పతకాలు సాధించాడు. శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కార్తీక్‌కు. తండ్రి నరసింహమూర్తి అనుక్షణం బాసటగా నిలుస్తున్నారు.
"రోజుకు గంటల తరబడి సాధన చేసి ఒక్కో మెట్టు అధిరోహించాడు.చదరగంరంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం వెనుక కార్తీక్ కృషి ఎంతో దాగి ఉంది.ఆత్మవిశ్వాసంతో చదరంగంలో ప్రతిభ కనబరుస్తున్న కార్తీక్‌కు ప్రభుత్వం, స్పాన్సర్లు ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాను". - నర్సింహమూర్తి, కార్తీక్ తండ్రి