రాజ్యసభలో ఒకరితో మొదలయ్యామని, ఇప్పుడు ఆరుగురం అయ్యామని.. 2024 నాటికి 11 మంది అవుతామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. గెలిచిన నలుగురు అభ్యర్థులూ తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నలుగురూ విజయసాయిరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. 'పార్లమెంటు ఉభయసభల్లో 30 మందికి పైగా సభ్యులున్న పార్టీకి కేంద్రంలో మంచి గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే శక్తి ఆ పార్టీకి ఉంటుంది. కాబట్టి మేం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతాం' అని విజయసాయిరెడ్డి చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. పార్టీలోని సీనియర్ సభ్యులతో కలిసి వాటి పరిష్కారానికి పనిచేస్తా. ప్రజలు, మీడియా ముందుకు వెళ్లి జగన్ రాష్ట్రానికి చేస్తున్న పనులు, ఆయన ఇమేజ్‌ను కొందరు ఎలా దెబ్బ తీస్తున్నారనేదీ వివరిస్తాం - పరిమళ్ నత్వానీ
రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రం భరించాల్సి ఉన్నా.. ఇంతవరకూ ఆ సాయాన్ని పొందలేకపోయాం. దాంతోపాటు, కేంద్రం వద్ద పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారానికి అందరం పోరాడతాం - సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
ముఖ్యమంత్రి విజన్, ఆలోచనలకు తగినట్లుగా రాజ్యసభలో పనిచేస్తాం. ఈరోజు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని వాటిపై ముందుకు వెళతాం -అయోధ్య రామిరెడ్డి