వైకాపా నేతల అవినీతి వ్యాప్తి.. కరోనాతో పోటీపడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలందిస్తూ కరోనా బారినపడిన వైద్యుడిని కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స అందించి బతికించాలని వేడుకున్న వైద్యుడి ప్రాణాలు కూడా నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయమని చంద్రబాబు ట్వీట్ చేశారు.
వైద్యుల పట్ల ఏమిటీ అమానుషం...: తెదేపా అధినేత చంద్రబాబు - వైద్యుల కష్టాలపై చంద్రబాబు ట్వీట్
వైద్యుల పట్ల వైకాపా ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తనకు మెరుగైన చికిత్స అందించి బతికించాలని వేడుకున్న వైద్యుడి ప్రాణాలు కూడా నిలపలేని స్థితిలో రాష్ట్రం ఉండటం శోచనీయమన్నారు. కరోనా నుంచి రికవరీలో ఏపీ అట్టడుగున ఉండటం చూస్తే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మర్యాద లేని చోట పని చేయలేమంటూ వైద్యుల సంఘం... సీఎస్‌కు లేఖరాయడం రాష్ట్రంలో దుస్థితికి నిదర్శనం. మాస్కుల కోసం విశాఖలో వైద్యులు ధర్నా, రక్షణ పరికరాల కోసం ఒంగోలులో ల్యాబ్ టెక్నీషీయన్ల ధర్నా ఏమిటీవన్నీ?. మాస్కు అడిగారని దళిత వైద్యుడు సుధాకర్‌పై కక్షగట్టి నడి రోడ్డుపై లాఠీలతో కొట్టించారు. చిత్తూరు జిల్లాలో వైద్యురాలు అనితారాణిపై అసభ్య వీడియోలు తీశారు. కరోనా విపత్తులో తమ ప్రాణాలు అడ్డుపెట్టి, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులపట్ల ఏమిటీ అమానుషాలు. ఏ రాష్ట్రంలోనైనా వైద్యుల పట్ల ఈ నిర్లక్ష్యం ఉందా?. కరోనా నుంచి రికవరీలో ఏపీ అట్టడుగున ఉండటం చూస్తే బాధేస్తోంది. కరోనా కిట్ల స్కామ్, బ్లీచింగ్ పౌడర్ కుంభకోణాలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. కరోనా విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి. వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక భద్రతా పరికరాలు సమకూర్చాలి- చంద్రబాబు, తెదేపా అధినేత