ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీ నుంచి కడలిలోకి నీటి విడుదల - water released from prakasham barrage news

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవటంతో జలాశయాలు నిండాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నదులు పొంగిపొర్లాయి. భూగర్భజల మట్టం పెరిగి కొన్ని ప్రాంతాల్లో బోరు బావుల నుంచి నీరు పైకి ఉబికి వచ్చింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో నిల్వ స్థాయులు మించిపోతున్నాయి. కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

prakasham barriage
ప్రకాశం బ్యారేజీ

By

Published : Nov 8, 2020, 2:30 PM IST

తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో కృష్ణమ్మ జలకళతో మురిసింది. తొంభై రోజులుగా వరద నీరు పోటెత్తుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఇంత పెద్దమొత్తంలో సముద్రంలోకి భారీగా నీటి విడుదల చేయడం గమనార్హం. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి భారీవర్షాలు నమోదుకావడంతో ఆగస్టు నెల నుంచి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు వరదనీటితో తొణికిసలాడుతున్నాయి. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నదికి ఇరువైపులా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూగర్భజల మట్టాలు పెరిగాయి. చాలాకాలం తర్వాత నీరు రావడంతో నది జీవావరణానికి మేలు జరగనుంది.

గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కి....

కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మించడంతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు నీటిచేరిక గగనమైంది. ఎగువన ఉన్న రాష్ట్రాలు కృష్ణా నీటిని ఆయా ప్రాంతాల్లో కాలువలకు విడుదల చేయడం, ఎత్తిపోతల పథకాల ద్వారా తోడేయడంతో వరుసగా భారీవర్షాలు వచ్చినప్పుడు మాత్రమే దిగువకు వరదనీరు వస్తోంది. ఇది జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల దాటుకుని ప్రకాశం బ్యారేజీ చేరే సరికి సెప్టెంబరు నెల వచ్చేది. ఈక్రమంలో ఎగువ నుంచి వచ్చిన నీరు కాలువలకు విడుదల చేయడంతో బ్యారేజీ నుంచి నదిలోకి నీటివిడుదల బాగా తగ్గింది. దీంతో నదీతీర గ్రామాల్లోనూ భూగర్భజలాల లభ్యత పడిపోయింది. ఒకప్పుడు 50 అడుగులుపైగా బోర్లు తవ్వుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

నదికి పశ్చిమ గట్టున గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాలు ఉన్నాయి. తూర్పు గట్టున కృష్ణా జిల్లాలో పెనమలూరు, కంకిపాడు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో సంవత్సరం పొడవునా ఉద్యాన పంటలు సాగుచేస్తారు. కరకట్ట లోపల అత్యంత సారవంతమైన భూములున్నాయి. ఏడాది పొడవునా వాణిజ్య, ఉద్యాన పంటలు భూగర్భజలాలపై ఆధారపడి సాగవుతున్నాయి. నదికి నీటి విడుదల లేకపోవడంతో ఇక్కడ జలాల లభ్యత తగ్గింది. ఈ పరిస్థితుల్లో గతేడాది 798 టీఎంసీలు, ఈఏడాది 1264.08 టీఎంసీలు బ్యారేజీ నుంచి నదికి విడుదల చేయడంతో పాతాళజలం పైపైకి వస్తోంది. కరకట్ట లోపలి బోరుబావుల నుంచి నీరు ఉబికి వస్తోంది. గతేడాది నుంచి పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీనికితోడు ఈఏడాది ఆగస్టు నెల నుంచి బ్యారేజీ నుంచి నదికి నీటి విడుదల చేయడం, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో నిరంతరం ప్రవాహాలు ఉండటంతో సముద్రంవైపు నుంచి ఉప్పు నీరు చొచ్చుకురాకుండా అడ్డుకట్ట పడింది.

నీటి విడుదలకు సంబంధించిన వివరాలు

బ్యారేజీ నుంచి 1375 టీఎంసీలు విడుదల

ప్రకాశం బ్యారేజీ నుంచి జూన్‌ నెల నుంచి నవంబరు 7వ తేదీ ఉదయం వరకు 1264.08 టీఎంసీల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణాడెల్టా తూర్పు కాలువకు 68.68 టీఎంసీలు, కృష్ణా పశ్చిమ కాలువకు 41.83 టీఎంసీలు, గుంటూరు వాహినికి 0.61 టీఎంసీల నీరు విడుదల చేశారు. మొత్తం మీద 1375.19 టీఎంసీలు బ్యారేజీ నుంచి కాలువలు, సముద్రానికి విడుదల చేశారు. స్థానికంగా వర్షాలు లేకపోయినా ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రస్తుతం సుమారు 20వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరుతోంది. కాలువలకు అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తూ మిగిలిన నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన ఉన్న జలాశయాలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సాగర్‌ టెయిల్‌పాండ్‌, పులిచింతలలో గరిష్ఠస్థాయిలో నీటిమట్టాలు ఉండటంతో నదిలో కనీస నీటిప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో బ్యారేజీకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో కాలువల అవసరాలకు పోగా మిగిలిన నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి: కమలా హారిస్​కు సీఎం జగన్ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details