కృష్ణా జిల్లాకు శివారు ప్రాంతమది. కొన్ని గ్రామాల్లో మంచినీటి చెరువుల జాడే కనపడదు. మరికొన్ని ఊళ్లకు కాలువల ద్వారా నీరెళ్లే అవకాశమే లేదు. ఓ వైపు ఉప్పుటేరు.. ఇంకోవైపు చేపలు, రొయ్యల చెరువులు విస్తరించి ఉన్నాయి. భూగర్భ జలాలు ఉప్పుమయంగా మారాయి. ఫలితంగా మంచినీటి బావులు కలుషితమయ్యాయి. తాగునీరు కావాలంటే సరిహద్దులో ఉన్న పొరుగు జిల్లాపై ఆధారపడాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఏటిలో పడవ ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఈ కష్టం తీర్చడానికి సామూహిక రక్షిత మంచినీటి పథకమే సరైన పరిష్కారం. మూడేళ్ల కిందట నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఈ పథకం ముందుకు సాగడం లేదు. నెల రోజులు పని జరిగితే.. ఆర్నెళ్లు ఆగిపోతుంది. ఏటా మాదిరిగానే ఈ వేసవి తీరని దాహంతో గడిచిపోయింది.
ఏడాదంతా ఎద్దడే..
కృష్ణా - పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో కలిదిండి మండలం శివారున ఉప్పుటేరుకు ఆనుకొని తాడినాడ, చినతాడినాడ, విభ్రాంపురం, సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ, మద్వానిగూడెం, కొండంగి, మట్టగుంట, పెదలంక తదితర గ్రామాలు ఉన్నాయి. ఇవి జిల్లాకు శివారున ఉండడం వల్ల తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయి. కాలువలకు నీటిని విడుదల చేసినప్పటికీ కొండంగి, మట్టగుంట, పెదలంక, చినతాడినాడ గ్రామాలకు చేరడం సాధ్యపడడం లేదు. ఇటీవల కాలంలో ఈ గ్రామాలకు కొంత ఊరటగానే ఉన్నప్పటికీ సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది.
ఈ గ్రామాల్లో తాగునీటి చెరువుల జాడ ఉండదు. ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న పోతుమర్రు మంచినీటి చెరువు నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయడానికి చాలాకాలం కిందట చేసిన ప్రయత్నం పూర్తిస్థాయిలో సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. గత్యంతరం లేని స్థితిలో పొరుగున ఉన్న పశ్చిమగోదావరి జిల్లా నుంచి మహిళలు పడవలపై వెళ్లి బిందెలతో మంచినీరు తెచ్చుకుంటున్నారు. మగవారంతా తెలవారుజామునే బయటకు వెళ్లిపోవడం వల్ల ఈ బాధ్యతను ఆడవారే తీసుకుంటున్నారు. దీనిపై ‘ఈనాడు’ పలు కథనాలు అందించింది. ఫలితంగా తాడినాడలో రూ.6కోట్ల వ్యయంతో సామూహిక రక్షిత పథకం నిర్మాణాన్ని ప్రారంభించారు.
మూడు వందల మీటర్ల దూరంలో..