సుమారు 30 వేల మంది ప్రజలు నివసించే అవనిగడ్డలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. కొన్ని చోట్ల మాత్రమే పంపుల్లో నీరు వస్తుంది. కొన్ని కుళాయిలు మురుగు గుంటలలో దర్శనం ఇస్తున్నాయి. గ్రామం చివర ఉన్న లంకమ్మ మన్యంలో కుళాయిలకు నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు.
చెరువు ఉంది.. కానీ నింపేవారు కరవు..! - avanigadda
అది మారుమూల ప్రాంతమేమీ కాదు...అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రం. దాదాపు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు ఉండే గ్రామం. అయినా నీటికి కటకటే. తాగునీటి చెరువు నింపక, భూగర్భ జలాలు అడుగంటిపోయి..ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ కేంద్రంలో సర్వే నెంబరు 211లో సుమారు 10 ఎకరాల గుర్రపు చెరువు ఉంది. నీరు ఎండిపోయి చుట్టు పక్కన చేతి పంపులు, బోర్లలో నీరు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా సిబ్బంది నిర్లక్ష్యంతో చెరువు ఎండిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రెండేళ్ల కిందట ఈ చెరువులోని నీటిని ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేసి ప్రజలకు తాగునీరు అందించేవారు. ఇప్పుడు అది కూడా మూలన పడేశారు. కాలువ గట్లు పక్కన బోర్లు వేసి కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నారు. బోర్ల ద్వారా టాంక్లోకి నీటిని ఎక్కించి...తాగునీటిని విడుదల చేస్తున్నారు. అయినా నీరు సరిపోక అవస్థలు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.