Water Problem In Nandigama: కృష్ణాజిల్లా నందిగామ పురపాలక సంఘంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల ప్రజలకు వారానికి ఒకరోజు మాత్రమే కొళాయి ద్వారా తాగునీరు అందుతుంది. అధికారులకు అభ్యర్ధిస్తే పది రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా పురపాలక అధికారులు తాగునీరు అందిస్తారు. కానీ అవి ఏ మూలకూ సరిపోవడం లేదంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తాగునీటి పథకం అభివృద్ధి, పైపులైను విస్తరణ పనుల కోసం రెండు ప్రభుత్వాల హయాంలో రెండు సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు కదలడం లేదు. నిధులు విడుదల కాకపోవడమే పనుల జాప్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కొందరి పట్టణ వాసుల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. పాత తాగునీటి పథకం ద్వారా కేవలం 40 శాతం మందికే నీరు అందుతోంది. మిగతా 60 శాతం మందికి తిప్పలు తప్పటం లేదు. ప్రధానంగా శివారు ప్రాంతాలైన డీవీఆర్, బీసీ కాలనీ, చెరువు బజార్, ముక్కుపాటి నగర్, రైతుపేట డౌన్ ప్రాంతాల్లో వారానికి ఒకసారి కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీరే వారం రోజులు దాచుకుని తాగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో ఏఐబీ ప్రాజెక్టు తీసుకువచ్చాము. 89కోట్ల రూపాయలు పెట్టుబడితో పనులు ప్రారంభించాం. నిధుల జాప్యం కావటంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశాము." -జయరామ్ ,నందిగామ పురపాలక కమిషనర్