కృష్ణా జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో చేపల సాగు ద్వారా ఏటా 8 లక్షల టన్నుల ఉత్పత్తులను సాధిస్తున్నారు. చేపల సాగులో అత్యధిక ప్రాధాన్యం నీటికే. మంచినీటి లభ్యతపైనే చేపల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఆర్నెళ్లకోసారి నీటి లభ్యత ఉంటేనే చేపల్లో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గి అనుకున్న స్థాయిలో ఉత్పత్తులను సాధించడంతో పాటు లాభాలకు వీలుంటుంది. కొంత కాలంగా నీటి లభ్యత అనుకున్న స్థాయిలో లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో పాటు నదులు, సరస్సులు, ఏరులు, కాలువలు అన్నీ మంచినీటితో కళకళలాడుతున్నాయి. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రైతుల అవసరాలు తీర్చేందుకు వీలుంటుంది.
రైతుల్లో చైతన్యం అవసరం..
ప్రభుత్వాలు ఆక్వారంగం నుంచి ఆదాయాన్ని పొందుతున్నా దీని ఉన్నతికి చేసింది మాత్రం శూన్యమే. పదేళ్లుగా జిల్లాలో విస్తరిస్తున్న ఉప్పునీటి వనామీ రొయ్యల సాగుతో చేపలసాగు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. భూగర్భం నుంచి 10 నుంచి 20శాతం ఉప్పు ఉన్న నీటిని సాగులో వినియోగించుకుని దాన్ని నేరుగా మంచినీటి కాలువలు, వనరుల్లో విడుదల చేస్తున్నారు. పూడికతో డ్రెయిన్లు నిండిపోవడంతో పంట కాలువల్లోనూ వదిలేస్తున్నారు. ఫలితంగా మంచినీటి వనరులు కలుషితమైపోతున్నాయి.
నీటిని ఒడిసిపట్టాలి..
- వర్షాకాలంలో అందుబాటులో ఉన్న మంచినీటని ఒడిసి పట్టేందుకు రైతులు శ్రద్ధ వహించాలి.
- చెరువుల్లో నీటి శుద్ధికి విధిగా ప్రోబయోటిక్స్‌ను వినియోగించుకుని ఎక్కువ కాలం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలి.
- ప్రభుత్వం ఆక్వా రంగాన్ని వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించి డెల్టా శివారు ప్రాంతాల్లో మంచినీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలి.
- వంతుల వారీగా కాకుండా ఆక్వాసాగు ప్రకారం అధికంగా ఉన్న నీటిని విడుదల చేయాలి.
శాఖాపరంగా కఠిన వైఖరి