విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో.. వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనా వివిధ కారణాలతో అడ్డంకులు తప్పడం లేదు. విజయవాడ నగరంలో తాగునీటి పైపులైన్లు, రోడ్లు, వీధి దీపాలు, మురుగు కాలువల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనుకున్న దశలో.. ప్రవర్తనా నియమావళి, తర్వాత కరోనాతో లాక్ డౌన్ వచ్చి పడింది.
ఫలితంగా మూడు నెలల పాటు వివిధ దశలలో ఉన్న పనుల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అభివృద్ధి పనులు మరింత ఆలస్యం కానున్నాయి. నగరపాలక సంస్థలో పలు పద్దుల కింద సుమారు రూ.369 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. చాలా పనులు టెండర్ల దశలో ఉండగా.. కొన్ని ఖరారయ్యాయి. కొన్ని సాంకేతిక అనుమతులు, ఒప్పంద దశల్లో ఉన్నాయి.
నగరంలో వివిధ అంశాలకు సంబంధించి మౌళిక వసతుల కల్పనకు నిధులు వెచ్చిస్తున్నారు. వీటిలో ఎక్కున భాగం శాశ్వత అవసరాలను దృష్టలో పెట్టుకుని పనులను ప్రతిపాదించారు. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నగరవాసుల అవసరాలను తీర్చే పనులకు ముందుగా ప్రాధాన్యం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, పనితీరు గ్రాంటు, ప్రత్యేక గ్రాంటు, ఇతర మార్గాల్లో నిధులు నగర పాలక సంస్థకు వచ్చాయి.
14వ ఆర్థిక సంఘం తొలి విడత కింద 14 పనుల కోసం.. రూ.42.25 కోట్లు, రెండో విడత కింద 45 పనుల కోసం రూ.43.25 కోట్లు మంజూరు చేశారు. పనితీరు గ్రాంటు కింద 14 పనుల కోసం రూ.14.50 కోట్లు, 2019-20 ఏడాదికి గాను 293 పనుల కోసం రూ.117.88 కోట్లు, ప్రత్యేక గ్రాంటు కింద 110 పనుల కోసం 150.96 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 487 పనులకు గాను.. 369.84 కోట్ల రూపాయల నిధులు నగరపాలక సంస్థకు అందాయి.
ఈ నిధులతో నగర వాసుల అవసరాలకు అనుగుణంగా వివిధ పనులను ప్రతిపాదించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, యూజీడీ లైన్ల ఏర్పాటు, ఓపెన్ జిమ్, అంతర్గత సీసీ డ్రైన్లు, దుకాణ సముదాయాలు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. పలు డివిజన్లలో పార్కుల అభివృద్ధి, పురపాలక పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, సీవేజీ లైన్ల మార్పు, సామాజిక భవనాలు, గ్రంథాలయాలు, అప్రోచ్ రోడ్ల పనులు చేపట్టనున్నారు.
ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్ బాల్ క్రీడలకు కోర్టులు, నడక దారి ఏర్పాటు చేయనున్నారు. అమృత్ పథకం కింద ఎంపిక చేసిన డివిజన్లలో 24 గంటల తాగునీరు అందించే ప్రాజెక్టును సైతం నగరంలో చేపట్టనున్నారు.
ఇప్పటికే పలు పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకోగా.. గుత్తేదారులతో ఒప్పందం చేసుకోవాల్సినవి మరికొన్ని ఉన్నాయి. కరోనా ఉద్ధృతి పెరగడంతో లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన కారణంగా.. నగర పాలక కార్యాలయం, పురపాలక శాఖ ప్రధాన కార్యాలయాల్లో సిబ్బంది విధులకు హాజరయ్యే పరిస్థితిలేదు.
ఈ కారణంగా.. టెండర్లు పిలవడం, ఖరారు, గుత్తేదారులతో ఒప్పందం చేసుకునే ప్రక్రియ నిలిచిపోయింది. లాక్ డౌన్ తో సిమెంట్ కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పడిప్పుడే ఉత్పత్తి తిరిగి మొదలైంది. దీంతో ప్రస్తుతం మార్కెట్ లో సిమెంట్ ఎక్కువ ధర పలుకుతోంది. ఇప్పుడు ఒప్పందాలు పూర్తై పనులు మొదలైనా కష్టాలు తప్పేలా లేదు. ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, ఉపాధి కూలీలు ప్రస్తుతం వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో.. పనులు మరింత ఆలస్యం కానున్నాయి.
ఇదీ చదవండి:
ఎస్ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు