విదేశం టూ రాజకీయం..
షబానా ఖాతున్... మెున్నటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఇప్పుడు విజయవాడలో అందరికీ ట్రెండ్ అవుతున్న పేరు. జలీల్ ఖాన్ రాజకీయ వారసురాలిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సార్వత్రిక బరిలోకి దిగుతున్నారు. అమెరికాలో స్థిరపడిన షబానాకు... తండ్రి స్థానంలో పోటీ చేయాలని చంద్రబాబు అవకాశమిచ్చారు. ఆమె తండ్రికి 2సార్లు అవకాశమిచ్చిన ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. తండ్రి మైలేజీ కుమార్తెకు కలిసి వస్తుందని తెలుగుదేశం శ్రేణులు ధీమాతో ఉన్నారు. ఇదే ఊపుతో ముమ్మరంగా ప్రచారం చేస్తూ... ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తున్నారు షబానా.
షబానాకు జై కొడతారా? వెల్లంపల్లితో వెళ్తారా? - tdp
ఒకరికి రెండోదఫా అవకాశం ఇవ్వని ఆ నియోజకవర్గ ఓటర్లు... ఇప్పటి వరకు... మహిళలకూ జై కొట్టలేదు. అంచనాలకు అందని విధంగా నేతల రాతలు మార్చే విజయవాడ పశ్చిమ గాలి ఇప్పుడు ఎటు వీస్తోంది. ప్రజాతీర్పు ఎలా ఉంటుంది? ఒకసారి ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తిని మళ్లీ ఆశీర్వదిస్తారా? తొలిసారిగా బరిలో దిగుతున్న మైనారిటీ మహిళకు అవకాశమిస్తారా?
గతంలో గెలిచిన వ్యక్తే..
2009లో ఇక్కడి నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు... మళ్లీ షబానా ఖాతున్పై పోటీ చేస్తున్నారు. అప్పుడు ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి... మల్లికా బేగంపై గెలిచారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి... 2014లో వైకాపా అభ్యర్థి జలీల్ ఖాన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వైకాపా కండువా కప్పుకున్నారు. ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ మూడోసారి బరిలో దిగుతున్నారు. కచ్చితంగా గెలిచి తీరుతామని వైకాపా ఘంటాపథంగా చెబుతోంది.