పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు... త్వరలో..! విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 2016 జూన్ 2న సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా భవనం అందుబాటులోకి తేవాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది. కానీ పనులు అనుకున్న సమయానికి పూర్తవలేదు. మూడేళ్లుగా జరుగుతున్న పనులు తుదిదశకు చేరాయి. కార్పొరేట్ హంగులతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ రూపుదిద్దుకుంటోంది.
8 ఆపరేషన్ థియేటర్లు, సెన్సార్ లైటింగ్ విధానం, 5 లిప్టులు, వెనుక వైపు అన్ని అంతస్థులనూ కలిపే విశాలమైన ర్యాంప్... ఈ బ్లాక్ ప్రత్యేకతలు. 5 అంతస్థుల్లోనూ... ఒక్కో రకమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వైద్యులు సూచించే అన్నిరకాల ఆరోగ్య పరీక్షలను... ఒకటో అంతస్థులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా... బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సీటీ స్కాన్, డయాలసిస్ యూనిట్, ఎండోస్కొపీ, ఫ్లోరోస్కొపీ, అల్ట్రాసౌండ్ గది, ఎక్స్‌రే యూనిట్లు... వంటివన్నీ మొదటి అంతస్థులోనే ఉంటాయి.
ప్రధాన శస్త్రచికిత్స విభాగాలు, వైద్య చికిత్స విభాగాలు, రోగుల వార్డులను రెండో అంతస్థులో ఏర్పాటు చేశారు. యూరాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ, న్యూరాలజీ, రేడియాలజిస్ట్ విభాగం, సమాచార సాంకేతిక యూనిట్... వంటివి రెండో అంతస్థులో ఉంటాయి. జీర్ణకోశ వ్యాధులు, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు, అత్యవసర కార్డియాక్ కేర్ విభాగం, క్యాథ్ ల్యాబ్ మూడో అంతస్థులో ఏర్పాటు చేస్తున్నారు.
నాలుగు, ఐదో అంతస్థులను... యాంటీ బ్యాక్టీరియల్ వినైల్ ఫ్లోరింగ్‌తో ఏర్పాటు చేశారు. నాలుగో అంతస్థు మొత్తాన్ని అత్యవసర చికిత్సకు వినియోగించనున్నారు. ఇక్కడే సమావేశ మందిరం, నిరంతర విద్యుత్ సరఫరా గది ఉన్నాయి. ఐదో అంతస్థులో 8 ఆపరేషన్ థియేటర్లు సహా పోస్ట్ ఆపరేషన్, అనస్థీషియా వార్డులు, సిబ్బంది గదులు ఉంటాయి.
240 పడకలతో 9 విభాగాలుగా సిద్ధమవుతున్న ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్... పూర్తిగా అందుబాటులోకి వస్తే న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియో థొరాసిస్, కార్డియాలజీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి వైద్యసేవలు అందనున్నాయి