మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారుతున్నారని విజయవాడ సీపీ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు.. గంజాయి, మద్యం అక్రమ రవాణాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని తెలిపారు. గతేడాది మొత్తం 4,500 కిలోల గంజాయి పట్టుకోగా.. 170 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో డ్రగ్స్ రవాణాపై ఎప్పటికప్పడు తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు.
మత్తు పదార్థాలకు బానిసలైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వెల్లడించారు. కొందరు మందుబాబులు మద్యానికి బానిసై శానిటైజర్ సైతం తాగి మరణిస్తున్నారని చెప్పారు. అక్రమ మద్యం, డ్రగ్స్ తరలిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.