విజయవాడ నగరంలో వృద్ధులపై నేరాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో వృద్ధులపై నేరాల్లో 25.4 శాతం విజయవాడలోనే జరగ్గా.. ఈ అంశంలో నగరం మొదటి స్థానంలో ఉంది. దీని ప్రకారం వృద్ధులపై నేరాలు గత రెండేళ్లతో పోలిస్తే తగ్గినప్పటికీ దేశంలో నమోదైన కేసుల్లో నాలుగోవంతు ఒక్క విజయవాడలోనే నమోదవడం గమనార్హం. వృద్ధులను మోసగించడం, వేధింపులు, సంతకాల ఫోర్జరీ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ ఒక్క విభాగంలోనే కాదు ఆర్థిక, సైబర్ నేరాలు, హత్యలు, బాలలు నేరాల్లో పాల్గొనడం గతం కంటే పెరిగింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలు స్వల్పంగా తగ్గాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) దేశంలోని 34 మహా నగరాల్లో 2019లో జరిగిన నేరాలపై నివేదికను బుధవారం విడుదల చేసింది.
దీని ప్రకారం.. 2018లో 17 హత్యలు జరగ్గా.. 2019కి ఆ సంఖ్య 26కి పెరిగింది. వీటిలో వివాహేతర సంబంధాలకు సంబంధించి 9, పరస్పర వివాదాలతో 13 హత్యలు జరిగాయి.
*● విజయవాడలో 14.9 లక్షల మంది జనాభా ఉండగా.. ప్రతి లక్ష మంది జనాభాకు 445పై ఐపీసీ, ఎస్‌ఎల్‌ఎల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ●
* బాలలు నేరాల్లో పాల్గొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. 2018లో 112 కేసులు నమోదవగా.. 2019లో 122కి పెరిగింది. దేశంలో నగరాల్లో నమోదైన కేసుల్లో 3.2 శాతం ఉంది.
* ● ఆర్థిక నేరాలు 2017లో 636 జరగ్గా.. 2018లో 537కి తగ్గాయి. మళ్లీ 2019లో 642కి పెరిగింది. వీటిలో రూ.లక్షలోపు కేసులు 398, రూ.లక్ష నుంచి రూ.10లక్షలలోపు 148, రూ.10-50 లక్షలలోపు కేసులు 53, రూ.50లక్షల నుంచి రూ.కోటిలోపు 8, రూ.10-25 కోట్లలోపు 4, రూ.25-50 కోట్లలోపు 1 కేసు నమోదైంది.