ముఖ్యమంత్రి జగన్ తనకున్న అవినీతి బురదను తమ అధినేత చంద్రబాబుకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనపై 6 నెలల నుంచి సీఐడీ విచారణ జరుగుతోంటే... ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ సీబీఐ విచారణ అంటోందని మండిపడ్డారు. సీఐడీని అసమర్థ విభాగంగా సీఎం భావిస్తున్నారా అని వర్ల ప్రశ్నించారు.
మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటరా అని ప్రజలంతా ఎదురు చూస్తే... గత తెదేపా పాలనపై సీబీఐ విచారణ అని తేల్చారని విమర్శించారు. ప్రభుత్వమే సీబీఐని పిలవటం....సీఐడీని అవమాన పరచడమే అన్నారు. మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం ఇగో పక్కన పెట్టి... సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా సముచిత నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. ఎస్‌ఈసీ వ్యవహారంలో గవర్నర్ కూడా పునరాలోచన చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.