రుణాలివ్వడం లేదని కృష్ణా జిల్లాలోని బ్యాంకుల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చెత్తపోసిన సంఘటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో మాట్లాడానని ఆమె ట్వీట్ చేశారు. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు ఇబ్బంది కలిగించిన విషయాన్ని ఆయనతో చెప్పగా, తగిన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారని కేంద్ర మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.
బ్యాంకుల ముందు చెత్త వేయడంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి - garbage dumped at the banks news
కృష్ణా జిల్లాలో బ్యాంకుల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చెత్తపోసిన ఘటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు ఇబ్బంది కలిగించిన విషయాన్ని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో మాట్లాడానని ఆమె ట్వీట్ చేశారు.
కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులో ఉన్న బ్యాంకుల ఎదుట గురువారం పారిశుద్ధ్య కార్మికులు చెత్త పోశారు. విజయవాడలోని మూడు యూబీఐ శాఖలు (పూర్వ ఆంధ్రాబ్యాంకు), సింగ్‌నగర్ ఎస్‌బీఐ, ఉయ్యూరులోని యూబీఐ, ఎస్‌బీఐ, సిండికేట్, కార్పొరేషన్ బ్యాంకులు, మచిలీపట్నంలోని యూబీఐ శాఖల ముందు చెత్త పోశారు. రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఇలా చేసినట్లు ఉయ్యూరులోని ఎస్‌బీఐ గేటుకు ఏకంగా పురపాలక కమిషనర్ పేరుతో కాగితం అంటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వేశామని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు. విజయవాడ సీతారాంపురం, సింగ్‌నగర్ బ్యాంకుల ఎదుట నగరపాలిక వాహనాల నుంచి చెత్త పోసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమయ్యాయి. చివరకు పురపాలక ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది వాటిని తొలగించారు.