తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. 53రోజులపాటు సమ్మెలో పాల్గొన్న కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని.. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని కేసీఆర్ ఆదేశించారు. యూనియన్ల కారణంగానే అసంబద్ధ డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగారని ముఖ్యమంత్రి అన్నారు. దీనివల్ల కార్మికుల కుటుంబాలే నష్టపోయాయని తెలిపారు.
సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లదే..
విపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లదే అని కేసీఆర్ స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా..? అని ప్రశ్నించారు. విపక్ష పార్టీలు..కార్మికుల్లో లేని ఆశలను కల్పించాయని మండిపడ్డారు.
ఆర్టీసీ సంస్థకు అవసరమైతే రూ. 100 కోట్లు
ఆర్టీసీ బతకాలనేది తమ ఉద్దేశమని సీఎం అన్నారు. ఆర్టీసీ సంస్థకు అవసరమైతే 100 కోట్ల రూపాయలు ఇస్తామని తెలిపారు. వచ్చే సోమవారం నుంచి ఆర్టీసీలో ఛార్జీల పెంపు ఉంటుందని.. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు ఆర్టీసీకి ప్రభుత్వ అనుమతి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కార్మికులను కాదని తాము నిర్ణయం తీసుకోమని, కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. సమ్మెలో చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఆర్టీసీ లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు.
తాత్కాలిక ఉద్యోగుల విషయంలో సానుభూతి...
యూనియన్ల స్థానంలో ప్రతీ డిపోలో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అన్నారు. సంస్థ కార్మికులదని, సంస్థ మనుగడతోనే వారి జీవితాలు ఇమిడి ఉన్నాయని చెప్పారు. తన మాటలు వింటే బాగుపడతారని, యూనియన్ల మాట వింటే బజారున పడతారని అన్నారు. తాత్కాలిక ఉద్యోగుల విషయంలోనూ సానుభూతితో వ్యవహరిస్తామని సీఎం పేర్కొన్నారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కేబినెట్ భేటీ షురూ... ఆర్టీసీపై కీలక చర్చ!