కొత్త ముఖ్యమంత్రి తన టీమ్‌ను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఎవరెవరిని ఎక్కడకు బదిలీ చేయాలి... ఎవరెవరికి ఏఏ శాఖలు అప్పగించాలి.. అనే విషయంలో నిమగ్నమయ్యారు. ఈక్రమంలో రాష్ట్ర యంత్రాంగంలో సమూల మార్పులు జరగనున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భారీ ఎత్తున స్థాన చలనం జరగనుంది. సీనియర్, జూనియర్ అధికారులు కలిపి సుమారుగా 70 నుంచి 80 మంది వరకూ బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగైదు రోజుల్లోనే బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి.
వారి దశ మారినట్టే...
అధికారుల నేపథ్యం, పనితీరు, గత ప్రభుత్వంలో వారి వ్యవహారశైలి వంటి విషయాలపై సమగ్ర సమాచారాన్ని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించారు. బదిలీలపై కసరత్తు కూడా చేసినట్టు సమాచారం. వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల్లో చాలా మందికి స్థాన చలనం కలగనుంది. దీంతో ఇంతవరకూ అప్రధాన్య పోస్టుల్లో ఉన్న వారి దశ మారబోతోంది. వారిని కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించనున్నారు. కొందరిని వేరే జిల్లాలకు మార్చనున్నారు.
వైద్యం, పర్యాటకం, జలవనరులకు ఎవరంటే...?
బదిలీల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్ కుమార్ మీనాను నియమించనున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్సైజ్ కమిషనర్, పర్యాటక శాఖ ఇన్చార్జిగా ఉన్నారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించనున్నారు. గతంలో ఆయన చాలాకాలం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సోమవారం నిర్వహించిన సమీక్షలోనూ ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో సీఎం కార్యాలయ అధికారులుగా పనిచేసిన సతీష్ చంద్ర, సాయి ప్రసాద్, రాజమౌలి, గిరిజా శంకర్లను ఇప్పటికే బదిలీ చేశారు. అయితే.. గిరిజా శంకర్‌ను పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.
సీఎం కార్యాలయంలోకి మరో ఇద్దరు...
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇప్పటికే ఇద్దరు అధికారులు బాధ్యతలు చేపట్టారు. మరో ఇద్దరిని నియమించాల్సి ఉంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ సీఎం కార్యాలయంలోకి రానున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అంశాలను ఇకనుంచి రమేష్ సీఎం కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారని.. జగన్ తెలిపారు. దీన్నిబట్టి చూస్తే రమేష్ సీఎం కార్యాలయానికి రానున్నారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఏపీకి రాబోతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఆమెకు మరేదైన కీలక శాఖ అప్పగిస్తారు.
ఇదీ చదవండీ: 'మండలి, అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ హోదాలు రద్దు'