సినీరంగ ప్రముఖులు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సహా పలువురు హీరోలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సీఎం సారథ్యాన జరిగే ఈ సమావేశంలో మంత్రి పేర్ని నానితో ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. నిర్మాతలు నష్టపోకుండా టికెట్ల ధరలు పెంచాలని పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ కూడా... టికెట్ ధరలు పెంచాలని ప్రాథమికంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. పరిశ్రమ ప్రతిపాదనలు, కమిటీ సిఫార్సులపై సినీ ప్రముఖులతో సీఎం చర్చించనున్నారు. ఎంతమేర టికెట్లు పెంచాలనే దానిపై అభిప్రాయాలు తీసుకుంటారని తెలిసింది.
రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా..
చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సాయంపైనా సీఎంతో సినీ ప్రముఖులు చర్చిస్తారని సమాచారం. కొవిడ్ తొలిదశలో లాక్ డౌన్ కారణంగా 3నెలల పాటు థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత తెరచుకున్నా 50 శాతం సీటింగ్ సహా వివిధ రకాల ఆంక్షలతో రాబడి అంతంతమాత్రమేనని యజమానులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లుల రాయితీ సహా సినీ కార్మికులకు సాయంపైనా చర్చించనున్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇవ్వడం, ఇతరత్రా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ పరిశ్రమ ప్రముఖులతో సమావేశం ఉండటం, అలాగే టికెట్ రేట్ల పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తున్నందున.... బుధవారం సీఎంతో మంత్రి పేర్ని నాని సమావేశమై చర్చించారు.
కొందరితోమే చర్చలు సరికాదు