కృష్ణా జిల్లాలో మూడో విడతగా మచిలీపట్నం డివిజన్‌లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 6.30 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీస్ శాఖ పరంగా తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. కొన్ని గ్రామాల్లో తేలికపాటి వాగ్వాదాలు, కోడూరులో స్వల్ప ఘర్షణ మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీలో ఓటు వేసి వస్తున్న ఒక వ్యక్తిపై గుర్తుతెలియనివారు కత్తులతో దాడి చేయగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనకు రాజకీయ సంబంధం లేదని, వ్యక్తిగత కారణాలతో చోటుచేసుకున్న సంఘటనగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం పంచాయతీలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా బంటుమిల్లి మండలం కంచడంలో వాలంటీరు ప్రచారం చేస్తున్నారని కొందరు ఆరోపించడంతో సకాలంలో పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. మోపిదేవి మండలం మోపిదేవిలో శాసనసభ్యుడు సింహాద్రి రమేశ్‌బాబు, తెదేపా నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మోపిదేవి వచ్చిన పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, జిల్లా ఎన్నికల పరిశీలకులు సుబ్రహ్మణ్యం మొవ్వ, నాగాయలంక ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మోహన్‌కుమార్, ఆర్డీవో ఖాజావలి, తదితర అధికారులు ఉదయం నుంచి డివిజన్ మొత్తం పర్యటిస్తూ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. మధ్యాహ్నం కలెక్టరేట్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును సమీక్షించారు. ఎస్పీ రవీంద్రనాథ్‌భాబు, ఏఎస్పీలు మలికగర్గ్, వకుల్‌జిందాల్ గూడూరు, మొవ్వ, అవనిగడ్డ, మచిలీపట్నం తదితర మండలాల్లో పర్యటించారు. పలు గ్రామ పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వారు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరికి పోలీస్ సిబ్బంది తగు సహకారం అందించారు.
లెక్కింపు కేంద్రాల వద్ద వివాదం
స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించిన అభ్యర్థులున్న చోట ప్రత్యర్థులు రీకౌంటింగ్‌ను డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. బందరు మండల పరిధిలోని ఓ అభ్యర్థికి 17 ఓట్లు ఆధిక్యం ఉన్నా అధికారులు సకాలంలో ఫలితాన్ని ప్రకటించకపోవడంతో గ్రామంలో వివాదం నెలకొంది. రెండు సార్లు లెక్కించినా మెజార్టీలో తేడా లేకపోయినా ఎందుకు ఫలితం ప్రకటించడం లేదంటూ ఎంపీడీవో, ఇతర అధికారులతో కొందరు గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు రిటర్నింగ్ అధికారి ఫలితాన్ని ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. పోతిరెడ్డిపాలెంలో లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.