AP Debits: రాష్ట్రం చేసిన అప్పుల తీరు తప్పని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్‌డీసీ)కు రూ.25 వేల కోట్ల రుణం ఇవ్వడంలో బ్యాంకులు నిబంధనలు పాటించలేదని రిజర్వుబ్యాంకు పేర్కొన్నట్లు కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర కార్పొరేషన్లకు ఇలాంటి అప్పులిచ్చే క్రమంలో నిబంధనలన్నీ పాటించాలని, ఇప్పటికే ఇచ్చిన అప్పులు నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో సమీక్షించి ఆయా బ్యాంకులు బోర్డులకు నివేదికలు ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్దేశించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లూ ఏపీఎస్‌డీసీ అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలో పసలేదని స్పష్టమైంది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భాగవత్ కరాడ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటున్న అప్పులపై ‘ఈనాడు’ అనేక కథనాలు ప్రచురించింది. ఏపీఎస్‌డీసీకి ఇచ్చిన గ్యారంటీలను దాచిపెట్టడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. అదనపు ఎక్సైజ్ సుంకం మళ్లించి ఆ సొమ్ముతో రుణాలు తీసుకోవడం, మద్యంపై వ్యాట్ తగ్గించి అంతేమేరకు బేవరేజెస్ కార్పొరేషన్ అదనపు సెస్ విధించి వసూలు చేసుకుంటూ అప్పులు చేస్తున్న తీరుపైనా కథనాలు ఇచ్చింది. అన్ని సందర్భాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ కథనాలను తప్పుపట్టారు. చివరకు కేంద్ర ఆర్థికశాఖ ఇలాంటి అప్పుల్లోని తప్పులను తేల్చేయడం విశేషం.
ఎంపీ విజయసాయిరెడ్డి ఏం అడిగారంటే..
1. ఏపీఎస్‌డీసీ రుణాల చెల్లింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోందా?
2. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించిందా?
3. ఒకవేళ అదే నిజమైతే రాష్ట్రానికి వ్యతిరేకంగా అంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి?
4. ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఈ విధానానికి (ఏపీఎస్‌డీసీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం)ఉన్న రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ధ్రువీకరించిన విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా?
కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే..
* ఏపీఎస్‌డీసీ సహా అనేక ప్రభుత్వరంగ సంస్థలు, మరికొన్ని స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సంస్థల ద్వారా తీసుకున్న రుణాల అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్ నుంచే చెల్లిస్తున్నట్లు ఆర్థికశాఖ దృష్టికి వచ్చింది. ఆర్థిక సంవత్సరం మొదట్లో రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశిస్తున్న నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తున్న దృష్ట్యా ఇలాంటి రుణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని 2022 మార్చిలో రాష్ట్రాలకు చెప్పాం. రాష్ట్ర బడ్జెట్ నుంచి చెల్లిస్తున్నా, ఏదైనా పన్ను/సెస్/ ఏ రకమైర రాష్ట్ర రాబడిని ఇందుకోసం వినియోగించినా అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3) ప్రకారం రాష్ట్రాల రుణ పరిమితిని నిర్ణయించేందుకు వీటిని పరిగణనలోకి తీసుకుంటాం.
* ఇలాంటి కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిబంధనలు పాటించడం లేదని ఆర్‌బీఐ తెలియజేసింది. మార్గదర్శకాలు సరిగ్గా అనుసరించాలని బ్యాంకులను ఆదేశించింది.
* బ్యాంకులు సంస్థలకు/ ప్రభుత్వరంగ సంస్థలకు రుణాలిచ్చేటప్పుడు వాటి లాభదాయకత ఎంత? ఆ అప్పు అంతిమంగా ఎక్కడ ఉపయోగపడుతోందో అంచనా వేయాలి. ఆ సంస్థలు తిరిగి ఎలా చెల్లిస్తున్నాయో పరిశీలించాలి. కార్పొరేషన్ల వ్యవహారంలో బ్యాంకులు ఇలా అంచనా వేయడంలో నిబంధనలు పాటించలేదని ఆర్‌బీఐ తెలిపింది. నిబంధనలు ఏ మేరకు అనుసరించారో పేర్కొంటూ బ్యాంకులు తమ పాలకమండళ్లకు నివేదిక పంపాలని కూడా ఆర్‌బీఐ ఆదేశించింది.
* ఏపీఎస్‌డీసీ రుణాలు తీసుకుంటున్న తీరుపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం అందింది. (కేంద్ర మంత్రి నాలుగో ప్రశ్నకు ఇంతే సమాధానం చెప్పారు. ఆ అభిప్రాయంలో ఏముంది, దాంతో కేంద్రం ఏకీభవిస్తోందో లేదో చెప్పలేదు.)
మొదటి నుంచీ వితండవాదమే!
ఏపీఎస్‌డీసీ రూ.25 వేల కోట్ల రుణం తీసుకున్న వైనంపై మొదటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వం వితండవాదమే చేస్తోంది. ‘ఈనాడు’ రాసిన కథనాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంవో ఆర్థిక ముఖ్య కార్యదర్శి దువ్వూరి కృష్ణ తదితరులు ప్రభుత్వం తరఫున తమ వాదన అనేకసార్లు వినిపించారు. ‘సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయం తీసుకొనే మేం ఈ విధానంలో రుణాలు తెచ్చాం. ఆ కార్పొరేషన్ అప్పు ప్రభుత్వ అప్పు ఎలా అవుతుంది?’ అని వాదించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కూడా, ఆ గ్యారంటీ పరిగణనలోకి రాదని బుగ్గన చెబుతున్నారు. ఆ గ్యారంటీ వినియోగించుకున్నప్పుడే అది లెక్కలోకి తీసుకుంటామని తొలుత బడ్జెట్ పుస్తకాల్లోనూ చెప్పలేదు. ‘ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త!’ అని కేంద్రం హెచ్చరించిందన్న వార్తలనూ వారు తప్పుపట్టారు. వారి వాదనలన్నీ వీగిపోయాయని తాజాగా రాజ్యసభలో కేంద్రమంత్రి కరాడ్ సమాధానాలను బట్టి అర్థమవుతోంది.
బేవరేజెస్ కార్పొరేషన్‌దీ అదే దారి