ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers struggling : ప్రకృతి కరుణించక.. ప్రభుత్వం సహకరించక..! ధాన్యం విక్రయాల్లో రైతుల కష్టాలు - Farmers

Farmers are struggling : ఓవైపు అకాల వర్షాల దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రైతులు.. మరో వైపు ప్రభుత్వ సహకారం కొరవడి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ధాన్యం తడిసి మొలకెత్తగా.. ప్రభుత్వం పంపుతున్న గోనె సంచులు చిరిగిపోయి ధాన్యం నష్టపోతున్నారు. మొలకెత్తి, రంగుమారిన ధాన్యాన్ని ఆర్​బీకే ల ద్వారా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 10, 2023, 7:14 AM IST

ధాన్యం కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు

Farmers are struggling : వర్షాలకు తడిసి ముద్దయి మొలకెత్తిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ ముందుకు రావడం లేదు. వర్షాలకు ధాన్యం రాశులు తడిచి రోజుల తరబడి అలాగే ఉండటంతో ధాన్యం మొలకెత్తింది. మరి కొన్ని చోట్ల రంగు మారింది. నిల్వ చేసిన ధాన్యం గుట్టల నుంచి పరదాలు తీసి ఆరబెడుతున్న సాగుదారులకు.. అడుగున మొక్క మొలిచి కుళ్లిన ధాన్యం దర్శనమిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం పంపుతున్న చినిగి పోయిన గోనె సంచుల్లో ధాన్యం నింపేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

మొలకెత్తిన ధాన్యం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట తీవ్రంగా దెబ్బతింది. కొనుగోళ్లు మందగించడంతో కోసిన ధాన్యం రాశులు నిల్వ చేసుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు. అదే సమయంలో వదలకుండా కురిసిన వర్షంతో పంట తడిసి ముద్దయింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ధాన్యం రాశుల నుంచి పరదాలు తీసి రైతులు ఆరబెడుతున్నారు. రోజుల తరబడి వర్షం కురవడం, అడుగు భాగం నీరు చేరి పంట ఉత్పత్తులు తడిచిపోవడంతో మొలకెత్తి కుళ్లిపోతోంది.

దీనివల్ల ఎకరాకు మూడు నుంచి 5 బస్తాల వరకు నష్ట పోవాల్సి వస్తోంది. బస్తాకు 1,530 రూపాయలు గిట్టుబాటు ధర రావాల్సి ఉండగా.. ఎక్కడా ఆ ధర దక్కక పోగా వర్షాల వల్ల రైతులకు అదనపు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఎలాలోగా అమ్మేద్దామనుకుంటే మొలకెత్తి రంగు మారిన ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీంతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన తమకు రంగుమారిన ధాన్యంతో మరింత నష్టం తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

చంద్రబాబు పర్యటనతో మారిన చిత్రం.. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు గోదావరి జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. రైతుల దీనస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మిల్లర్లకు రైతులు ఎదురు చెల్లిస్తేనే కొనుగోలు చేసే విధానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం.. ధాన్యం సేకరణ వేగం పెంచింది. అయితే నూక శాతం నిబంధనతో రైతుల నుంచి డబ్బులు వసూలు, స్థానికంగా ఉన్న మిల్లులు కాదని దూర ప్రాంతంలోని రైస్ మిల్లులకు తరలింపుపై మార్పు చేయలేదు.

అలాగే చినిగిపోయి, రంధ్రాలు పడి ఏ మాత్రం ధాన్యం నిల్వచేయలేని గోనె సంచులు కళ్లాల వద్దకు మిల్లర్లు పంపిస్తున్నారు. వాటిలో ధాన్యం నింపేదుకు కూలీలు తంటాలు పడుతున్నారు. చిరిగిన సంచుల్లో ధాన్యం వినియోగించకపోయినా.. ఒక్కో దానికి 25 రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఖరీఫ్ తోపాటు రబీలోనూ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయామని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కౌలుదారులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details