సంఘాల్లో పేరుకుపోయిన వస్త్ర నిల్వలు
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు గూడూరు, పెడన, ఘంటసాల, ముదినేపల్లి, చల్లపల్లి, మొవ్వ మండలాల్లో 34 చేనేత సంఘాల పరిధిలో వేలాదిమంది కార్మికులు నేత పనిపై ఆధారపడి జీవిస్తారు. ప్రస్తుతం ఆయా సంఘాల్లో రూ. కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తులు మూలుగుతున్నాయి. ఉత్పత్తులు కొనేవారి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న తరుణంలో అందరూ దసరా, దీపావళి, సంక్రాంతి పండగలపై ఆశపెట్టుకున్నారు. ఏటా ఒక్కో పండగకు పదిరోజులు చొప్పున వస్త్రాల కొనుగోలుపై ప్రభుత్వం 30శాతం రాయితీ ఇస్తుంటుంది. తక్కువ ధరకు వస్త్రాలు రావడంతో ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఒక్కో పండగకు రూ.2కోట్ల వరకు వస్త్రాలు అమ్ముడు పోతుంటాయి. దసరాకు ఆ రాయితీకూడా ప్రకటించక పోవడంతో ఆ ఆశకూడా పోయిందని ఆయా సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. మిగిలిన పండగలకైనా ఇస్తారో లేదోనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బకాయిల విడుదల ఎప్పటికో..?
ఇటు రాయితీ ప్రకటించకపోగా ఆయా సంఘాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కూడా విడుదల చేయడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉన్న సంఘాలకు వివిధ పథకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తుంటాయి. కొన్నేళ్లుగా ఆ బకాయిలు కూడా విడుదల కావడం లేదు. కేవలం మార్కెట్ ఇన్సెంటివ్ కింద రావాల్సిన బకాయిలే రూ.5కోట్లకుపైగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతోపాటు పెట్టుబడిపై వడ్డీ రాయితీ కింద రూ.1.23కోట్లు, నూలు రాయితీ కింద రూ.కోటి వరకు విడుదల కావాల్సి ఉంది ఇలా జిల్లా వ్యాప్తంగా ఆయా సంఘాలకు కలిపి మొత్తం రూ.7.52కోట్ల వరకు బకాయిలు రావాలి. ప్రభుత్వం చొరవ చూపి బకాయిలను వెంటనే విడుదల చేయాలని సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ఉపయోగం ఉండదంటున్నారు.
- పండగకు రూ.25 లక్షలు
జాగాబత్తుల కోటేశ్వరరావు, శ్యామ్‌ప్రసాద్ చేనేత సహకారసంఘ మాజీ అధ్యక్షుడు