Telugu Desam Party leaders met the Governor: ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణకు ఆర్టికల్ 355ను అమలు చేయాలని తెలుగుదేశం నేతల బృందం గవర్నర్ను కోరింది. రాష్ట్రంలో వివిధ వర్గాల పై జరుగుతున్న వరుస దాడులకు సంబంధించి రాజ్ భవన్ లో గవర్నర్ కు తెలుగుదేశం బృందం ఫిర్యాదు చేసింది. చెరుకుపల్లి లో అమర్నాథ్ సజీవ దహనం సహా వివిధ అంశాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టి కి తీసుకెళ్లింది. మహిళలపై అత్యాచారాలు, విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఉదంతం, హత్యలు, దాడులకు సంబంధించి గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుతో పాటు అనగాని సత్య ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, వర్ల తదితరులు గవర్నర్ ను కలిశారు.
మణిపుర్ తరహాలో ప్రత్యేకాధికారిని నియమించాలని... ఏపీలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కంట్రోల్ పెట్టడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని గవర్నరుకు విన్నవించామని నేతలు వెల్లడించారు.మణిపూర్ తరహాలో ఏపీలో కూడా ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.తమ అభ్యర్థనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని నేతలు పేర్కొన్నారు. జూన్ నెలలో 15 రోజుల్లో 15 సంఘటనలు జరిగాయని నేతలు ఫిర్యాదులో తెలిపారు. ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పేర్ని నాని ఇంటి సమీపంలోనే మరో దారుణం జరిగిందన్నారు. ఏపీలో వ్యాపారాలు చేసుకోలేను, ఈ సీఎంకు ఓ దండం అని చెప్పి సొంత ఎంపీనే హైదరాబాద్ వెళ్లిపోతానన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.