Telangana Assembly Sessions 2023: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల సలహా మండలి నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం శాసనసభలో తెలిపారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర శాసనసభలో హరీశ్‌రావు, మండలిలో ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 7న శాసనసభకు సెలవు. తిరిగి 8న సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. దానికి రాష్ట్ర ఆర్థికమంత్రి సమాధానం చెబుతారు.
9, 10, 11 తేదీల్లో పద్దులపై చర్చ ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాలను సైతం నిర్వహిస్తారు. 12న ఆదివారం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. దానికి సభ ఆమోదం తెలపనుంది. అంతటితో సమావేశాలు ముగుస్తాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం శాసనసభ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాలపై చర్చ అనంతరం ఉభయసభలు ఆమోదం తెలిపాయి.
చరిత్రలో తొలిసారి ఫిబ్రవరిలోనే : రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఫిబ్రవరి రెండోవారంలోనే బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నెల 12తో వాటిని ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న ఉభయసభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా..తర్వాత ఆరు రోజుల్లోనే సమావేశాలు ముగియనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓటాన్‌అకౌంట్ మినహా ఇతర సందర్భాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు మార్చి నెలలోనే జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం దృష్ట్యా 2014లో నవంబరు అయిదో తేదీన బడ్జెట్ సమావేశం జరిగింది. 2018 డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరగగా... మరుసటి ఏడాది సెప్టెంబరు 9న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
సమావేశాల తర్వాత అమల్లోనే పాత బడ్జెట్: ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు మార్చిలో ఉంటాయని అంతా భావించినా.. కేసీఆర్ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్ ఆమోదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై బడ్జెట్ అమల్లోకి వస్తుంది. అందుకే అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్ ఆమోద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా.. ఈసారి ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక 47 రోజుల పాటు పాత బడ్జెట్ అమల్లోనే ఉంటుంది. ఇంత త్వరగా బడ్జెట్ సమావేశాల ముగింపుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
దేని కోసం ముందుగా బడ్జెట్ సమావేశాలు :సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి విస్తరించడానికి భారాసను ఏర్పాటు చేసి కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో భారాస ఆవిర్భావసభ జరగగా.. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో సభను నిర్వహించనున్నారు. తర్వాత ఒడిశా, ఏపీ తదితర రాష్ట్రాల్లో సభలున్నాయి. పార్టీ రాష్ట్రశాఖల ఏర్పాటుతో పాటు రాష్ట్రాలవారీగా బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను పెద్దఎత్తున ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు.
ముందస్తు ఎన్నికల కోసమే: ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ప్రారంభించి, అదే రోజు పరేడ్ మైదానంలో భారీ సభను నిర్వహించనున్నారు. దీని కోసం జనసమీకరణ, కార్యక్రమానికి సీఎంలు, మాజీ సీఎంల ఆహ్వానం, బస ఇతర ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారు. తర్వాత అమరవీరుల స్మారక స్తూపం ప్రారంభించనున్నారు. ఈ నెల చివరి వారంలో బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు 18 జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవం జరిగింది. మరో ఎనిమిది ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే శాసనసభ సమావేశాలను త్వరగా ముగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని విపక్షాలు మాత్రం బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో జరపడాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ముందస్తు ఎన్నికల కోసమే ఫిబ్రవరిలోనే ముగిస్తున్నారని విమర్శిస్తున్నాయి. తమ పార్టీ శ్రేణులకు ఇదే సందేశాన్ని ఇస్తున్నాయి.
ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ :రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయడమే ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికపై సమావేశంలో చర్చించనున్నారు. ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ దఫాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. దీంతో ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎన్నికల కోణంలో మరోమారు భారీ పద్దునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.