రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం గొలుసుదుకాణాలు ఘర్షణలకు అడ్డాలుగా మారుతున్నాయి. దూరప్రాంతాల నుంచి యువకులు వచ్చి సరిహద్దుల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో స్థానికులపై దాడులకు దిగుతున్నారు. మద్యం అక్రమరవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ ఇతర మార్గాల్లో మద్యం వరదలా పారుతోంది.
మద్యం మత్తులో గ్రామస్థులపై యువకుల దాడి
రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు... కొంతమంది అక్రమార్కులకు వరంగా మారుతోంది. రేట్లు విపరీతంగా పెరగడం, ప్రముఖ బ్రాండ్ల మద్యం అందుబాటులో లేకపోవడం అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తెచ్చి ఏపీలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో యువకులు సరిహద్దు ప్రాంతాల వద్ద మత్తులో గ్రామస్థులపై దాడికి తెగబడుతున్నారు.
మైలవరం మండలంలో ఆరుగురు యువకులు మద్యం మత్తులో స్థానికులపై దాడికి దిగిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో గొలుసు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని సరిహద్దు గ్రామాల వాసులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో జన సంచారం లేకపోయినా పక్క నిర్మాణాలు చేపట్టారు. కేవలం ఆంధ్ర నుంచి వచ్చే మందుబాబులను దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఎస్ఈబీ అధికారి మురళీధర్ సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా సరిహద్దు వెంట తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బెల్ట్ దుకాణాలపై ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నామన్నారు.
ఇవీ చూడండి...:మసాజ్ పార్లర్ మాటున అసాంఘీక కార్యకలాపాలు