కృష్ణాజిల్లా నూజివీడులో తెదేపా కార్యకర్తలు మణి, నాగబాబుపై 'వైకాపా గూండాలు' చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. వైకాపా ముష్కరులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ముష్కరుల మాదిరి దారికాచి తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకులకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తామన్నారు. తెదేపా వారితో ఎందుకు పెట్టుకున్నామా అని వైకాపా నాయకులు దిగులు పడే రోజు దగ్గర్లలోనే వుందని అన్నారు.
దాడి చేసిన వారిపై తెదేపా కార్యకర్తలు కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఆక్షేపనీయమన్నారు. బాధితులపైనే కేసులు పెట్టే వింత సాంప్రదాయానికి ఏపీ పోలీసులు నాంది పలికారని విమర్శించారు. పోలీసులు వేసుకుంది నీలి చొక్కాలు కాదు.. ఖాకీ చొక్కాలన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శాంతిభ్రదతల పట్ల డీజీపీకి విశ్వాసం ఉంటే ఇప్పటి వరకు జరిగిన అరాచకాలపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.