TDP MP KANAKAMEDALA: తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రాజ్యసభ శూన్య గంటలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో మాదిగ, రెల్లి కులాలు చాలా వెనుకబడి ఉన్నాయని.. వారు విధిలేని పరిస్థితుల్లో.. మరుగుదొడ్లు శుభ్రం చేయడం లాంటి పనులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీల్లో విభజన లేకపోవడం వల్ల కేవలం కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నాయని.., మిగతా కులాలకు ఆ ఫలాలు అందుకోలేకపోతుండటంతో.. విద్య, ఉద్యోగాల్లో అసమానతలు పెరుగుతున్నాయని ఎంపీ కనకమేడల పేర్కొన్నారు. ఈ సమస్యను చట్ట సవరణ ద్వారా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:AP Capital Issue: ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే.. రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన
1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎస్సీ రిజర్వేషన్లను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి 2004 వరకు అమలు చేశారన్నారు. అయితే, చట్టం చేసే అధికారం కేవలం పార్లమెంటుకే ఉందని చెప్పి సుప్రీంకోర్టు నాడు ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని కొట్టివేసిన ఉదంతాన్ని కనకమేడల వివరించారు. 2004లో అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో దీనికి సంబంధించి ఎకగ్రీవ తీర్మానం చేసి.. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్రానికి పంపిందన్న విషయాన్ని ప్రస్తావించారు.