రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని తెదేపా నాయకులు ఆందోళన చేశారు. పెనమలూరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సుదిమల్ల రవీంద్ర ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్నంలో ఎస్సీ యువకుడి శిరోముండనం ఘటన చాలా బాధకరమైన విషయంగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తానని చెబుతూ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడటం సబబు కాదన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు పెట్టడం ఆనవాయితీగా మారుతోందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి ఆఖరి దశ కొనసాగుతుందని...ఇకపై ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.