మండలి సమావేశాల కవరేజీకి అన్ని మీడియా ప్రతినిధులను అనుమతించాలని తెదేపానేత యనమల రామకృష్ణుడు మండలి ఛైర్మన్ షరీఫ్‌కు లేఖ రాశారు. వారిని అనుమతించకపోవడం పార్లమెంటరీ వ్యవస్థకు భంగం కలిగించడమేనని అన్నారు.. చట్టసభలకు కొన్ని ఛానళ్లపై ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ పోకడలు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలైన చట్టసభలకే విరుద్దమని దుయ్యబట్టారు. పార్లమెంటరీ వ్యవస్థకు తూట్లు పొడిచేలా వైకాపా ప్రభుత్వ నిర్ణయాలన్నాయని ఆయన పేర్కొన్నారు.
చట్టసభలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది మన రాజ్యాంగ పెద్దల ఆకాంక్ష అన్న యనమల...సభా ప్రసారాలను ప్రత్యక్షంగా చూసే హక్కు ప్రజలకు ఉందని వివరించారు. ప్రసార సంస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ మధ్య బలమైన బంధం ఉందని.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత వీటిపైనే ఉందని చెప్పారు. సీఎం సొంత మీడియా ప్రతినిధులను, తన అనుకూల సంస్థల ప్రతినిధులను, కెమెరాలనే సభలోకి అనుమతించడం ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం కాదని తేల్చిచెప్పారు. రేపటినుంచి ప్రారంభం కానున్న సభా సమావేశాల్లో దీనినే ప్రధానాంశంగా చేపడతామని తెలిపారు.