ఇళ్ల పట్టాల విషయంలో వైకాపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. జీవో నెం-72 ద్వారా విశాఖపట్నంలో 2వేల 552 ఎకరాల అసైన్డ్ భూమిని ఇళ్లస్థలాల కోసం తీసుకున్నారని.. దానికి తోడు అంక్రోచ్ మెంట్ లో ఉన్న 2 వేల 343 ఎకరాలను తీసేసుకున్నారని దుయ్యబట్టారు. విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లలో పోలీసుల సాయంతో పేదలు సాగు చేసుకుంటున్న 5వేల ఎకరాల భూమిని లాక్కొన్నారని మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లాలోని 4వేల ఎకరాల ప్రభుత్వ భూమిని మాత్రం బిల్డ్ ఏపీ పేరుతో నడిపే సోల్డ్ ఏపీకి కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ దుర్మార్గం వల్ల ఎస్సీల్లో 4 వేల 136 కుటుంబాలు, బీసీల్లో 3 వేల 995, ఎస్టీల్లో 200, మైనారిటీల్లో 350 కలిపి దాదాపు 12వేల 336 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది: పట్టాభి - ఏపీలో ఇళ్ల స్థలాలు పంపణీ వార్తలు
ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో వైకాపా ప్రభుత్వం 3 వేల 160 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. నివాస ప్రదేశాలకు దూరంగా ఉండే, ముంపునకు గురయ్యే భూములను పేదలకు కట్టబెడుతూ.. మంచి భూములను వైకాపా నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
"ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది. వాటాల్లో తాడేపల్లికి ఎంత, విజయసాయికి ఎంత, సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంత వెళ్లాలో లెక్కలు తేలడానికి సమయం పడుతుంది కాబట్టే.. ప్రభుత్వం స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. సాగు చేసుకుంటున్న భూమిని లాక్కొని ప్లాట్లుగా మార్చి.. తిరిగి వారికే ఇస్తున్నారు. నివాస ప్రదేశాలకు దూరంగా ఉండే.. ముంపునకు గురయ్యే భూములను పేదలకు కట్టబెడుతూ.. మంచి భూములను వైకాపా నేతలు అమ్ముకుంటున్నారు. చెరువులు, కుంటలు, ఆఖరికి శ్మశానాల్లోనూ ప్లాట్లు వేస్తున్నారు"- కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి.
ఇదీ చదవండి:ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్స