వర్షాల కారణంగా పంటలు సహా సర్వం కోల్పోయిన ప్రజలను మంత్రులు ఎవరూ పరామర్శించలేదని.. ముఖ్యమంత్రేమో విహంగ వీక్షణం చేసి వదిలేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అన్ని కార్యక్రమాల్లో నాడు - నేడు అని చెప్పే ముఖ్యమంత్రి, ప్రకృతి విపత్తుల సమయంలో నాడు చంద్రబాబు ఎలా వ్యవహరించారో.. నేడు తానెలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రంలో ఒకవైపు నియంత పాలన సాగుతుంటే.. మరోవైపు తుపాన్ల ప్రభావం ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు. వరద, తుపాను బాధితులను శిబిరాలకు తరలించి వదిలేశారని.. వారికి ఆహారం, నీరు అందుతున్నాయో లేదో పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దోపిడీ గురించి తప్ప వ్యవసాయం గురించి ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. అందుకే పంట పరిహారం లెక్కలను సరిగా అంచనా వేయడం లేదని విమర్శించారు. రైతులకు తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.