TDP leaders fire on YSRCP : తెలుగుదేశం నేత కొమ్మాలపాటి శ్రీధర్ అరెస్టు దుర్మార్గమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అక్రమాలు వెలికితీస్తే.. జగన్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేయిస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ప్రతిపక్షంగా తాము చేతులు కట్టుకు కూర్చుకోవాలా అని నిలదీశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు నదిలోకి రోడ్డు వేసి యథేచ్ఛగా ఇసుకను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు ఇసుక దొంగల్ని వదిలి టీడీపీ నేతల్ని అరెస్టు చేయటం ఏంటని ప్రశ్నించారు. పోలీసులే ఇసుకను మాఫియాను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కొమ్మాల పాటి శ్రీధర్ ను వెంటనే పోలీసులు విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
అవినీతి సొమ్ము కక్కిస్తాం.. మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అక్రమ తవ్వకాలపై ఎంక్వయిరీ వేసి అవినీతి సొమ్ము కక్కిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతల ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నించి.. ప్రమాణానికి సిద్ధమైన కొమ్మలపాటి శ్రీధర్‌ను అక్రమంగా అరెస్టు చేసి తరలించడం దుర్మార్గమన్నారు. శ్రీధర్ ప్రమాణానికి రాకుండా అవినీతి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు భయపడ్డాడని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయడం సరికాదని పేర్కొన్నారు. మీడియా సమావేశం తరువాత మాజీ శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ను కలవడానికి గురజాల వెళ్తున్నట్టు తెలిపారు.