TDP Fire on Power Cuts : అప్రకటిత కరెంటు కోతలు, అడ్డగోలు బిల్లుల మోతలతో జగన్ రికార్డులు సృష్టిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు ధ్వజమెత్తారు. లోడ్ రిలీఫ్ పేరుతో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని, జలవిద్యుత్ కేంద్రాల నిర్వహణకు నాలుగేళ్లుగా నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేని గ్రామం గానీ, నగరం గానీ లేదని పేర్కొంటూ.. స్విచ్ వేయకుండానే ప్రజలకు కరెంట్ షాక్ కొడుతోందని ఎద్దేవా చేశారు. గజదొంగలు సైతం విస్తుపోయేలా ప్రజలను జగన్ దోచుకుంటున్నారని,జగన్ నాలుగేళ్ల పాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 57 వేల కోట్లకు పైగా భారం మోపారని ఆరోపించారు.
TDP regime వైసీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు 4 రెట్లు పెరిగితే.. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదని కళా వెంకట్రావు గుర్తుచేశారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండానే వినియోగదారుల నుంచి కనీస వినియోగ ఛార్జీ ఏ విధంగా వసూలు చేస్తారని ప్రశ్నించారు. కొత్త కొత్త రూపాలు, మోసపూరిత పద్ధతుల్లో ప్రజలపై భారం వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫిక్స్‌డ్, కస్టమర్ చార్జీలు, విద్యుత్ సుంకాలు ట్రూ అప్, సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజల నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. అదనపు లోడ్ పేరుతో డెవలప్‌మెంట్ చార్జీలంటూ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని, కస్టమర్ ఛార్జీలు, ఫిక్స్‌డ్ ఛార్జీలు, సర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ(Electriciyt Duty) లాంటి పేర్లతో దాదాపు 80 శాతం బిల్లు వాడకుండానే వినియోగదారులు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం బిల్లులో 50 శాతం ట్రూఅప్ భారాలు ఉండటం జగన్ దోపిడీకి నిదర్శనమని విమర్శించారు. 'జె టాక్స్' భారం ప్రజలపై వేస్తారా అని ప్రశ్నించారు.
Power Cutting అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో విద్యుత్తు కోతలతో జనంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లోడ్ రిలీఫ్, ఎల్ఆర్ పేరుతో రాత్రింబవళ్లు ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో ప్రజలు, రైతులకు అగచాట్లు తప్పడం లేదు. విద్యుత్తు ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. చీకటిలో రోగులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. సెల్ఫోన్ల(Cell Phone) వెలుతురులో రోగులు అన్నం తినాల్సిన పరిస్థితి నెలకొంది. ఉరవకొండ నియోజకవర్గంలోనే అతి పెద్ద ఆస్పత్రి కాగా.. ఈ ఆస్పత్రిలో జనరేటర్లు, ఇన్వర్టర్లు లేక చీకటిలో రోగులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.