ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP fire on CM Jagan: నీ వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం జగన్ రెడ్డీ : టీడీపీ

TDP fire on CM Jagan delhi tour: పార్లమెంటులో నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్నా... నాలుగేళ్లలో రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్సీపీ సాధించిందేమిటో సీఎం జగన్ వాస్తవాలను వెల్లడించాలని టీడీపీ డిమాండ్ చేసింది. జగన్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తరచూ దిల్లీ పర్యటనల ఆంతర్యమేమిటని సూటిగా ప్రశ్నించింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 6, 2023, 8:58 PM IST

Updated : Jul 7, 2023, 6:26 AM IST

TDP fire on CM Jagan: జగన్ రెడ్డి దిల్లీ పర్యటన ద్వారా రాష్ట్రానికి సాధించిందేమిటో ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. కేసుల మాఫీ, సొంత ప్రయోజనాల కోసమే జగన్ రెడ్డి పర్యటన అంటూ వాస్తవ నివేదికను తెలుగుదేశం విడుదల చేసింది. జగన్ రెడ్డి ఇప్పటి వరకు 29 సార్లు ప్రత్యేక విమానాల్లో దిల్లీ వెళ్లినా, ఆయన పర్యటన వల్ల రాష్ట్రానికి ప్రత్యేకంగా చేకూరిన ప్రయోజనాలేమిటో ఇంతవరకు వెల్లడించలేదని టీడీపీ విమర్శించింది.జగన్ రెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం,కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు, తన అక్రమాస్తుల కేసుల్లో విచారణ వేగవంతమైన వెనువెంటనే ప్రత్యేక విమానాల్లో దిల్లీ వెళ్లి ప్రత్యేక భేటీలు జరుపుతున్నారని ఎద్దేవా చేసింది.

సమాధానం చెప్పగలరా.. కేసుల గురించి, ముందస్తు ఎన్నికల కోసమే జగన్ రెడ్డి దిల్లీ వెళ్లారని అందరూ భావిస్తున్నారు... దీనిపై ఎందుకు సమాధానం చెప్పరని నిలదీసింది. దిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర హోంమంత్రితో ఎందుకు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రి బహిర్గతం చేయాలని కోరింది. 4 సంవత్సరాల్లో విభజన చట్టం హామీల అమలులో కానీ, రాష్ట్రానికి కొత్తగా సాధించిన ప్రాజెక్టులు, నిధులు కానీ శూన్యమని దుయ్యబట్టింది.విభజన అనంతరం రాష్ట్రానికి రావలసిన ప్రత్యేకహోదా, హామీల అమలు, రైల్వే జోన్‌, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాల కోసం వైఎస్సార్సీపీ చేసింది, సాధించిందేమిటని ప్రశ్నించింది. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్‌ అవుతుందంటూ ప్రతిపక్ష నేతగా ఊరూరా తిరిగి ప్రచారం చేసిన జగన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా గురించి నోరు మెదప లేదని ఆక్షేపించింది. ప్రత్యేక హోదా కోసమంటూ 2018లో రాజీనామాల పేరుతో హడావుడి చేసి దీక్షకు దిగిన వైఎస్సార్సీపీ ఎంపీలు అధికారంలోకి వచ్చాక హోదా గురించి ఒక్కరోజు కూడా కేంద్రాన్ని నిలదీయలేదని మండిపడింది.

నాలుగేళ్లలో ఏం సాధించారని.. ఇంటి నిండా కోళ్లున్నా కూసేందుకు ఒక్కటీ లేదు అన్న విధంగా వైఎస్సార్సీపీ ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఉంది అని విమర్శించింది. 22మంది లోక్​సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు కలిసి పార్లమెంటులోనాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైఎస్సార్సీపీ 4 సంవత్సరాల్లో విభజన చట్టం హామీలు అమలు, కొత్తగా సాధించిన ప్రాజెక్టులు, నిధులు శూన్యం అని ఒక ప్రకటనలో పేర్కొంది. పోలవరం నిర్మాణంపై నిర్లక్ష్యం చేశారని, టీడీపీ హయాంలో సిద్ధం చేసిన రూ.55548కోట్ల డీపీఆర్​ను కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ 2019లోనే ఆమోదించినా అప్పుడు విమర్శించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు అదే మొత్తాన్ని ఎందుకు ఆమోదించుకోలేని స్థితిలో ఉన్నాడని ప్రశ్నించింది.

Last Updated : Jul 7, 2023, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details